Share News

టెట్‌ రెడీ

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:14 AM

Notification issued for Teacher Eligibility Test ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహణకు విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2011కు ముందు టెట్‌ రాయకుండా నియమితులై సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులతో పాటు డీఎస్సీకి హాజరయ్యే అభ్యర్థులకు ఈ పరీక్ష నిర్వహించనుంది.

టెట్‌ రెడీ

  • ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నోటిఫికేషన్‌ జారీ

  • వచ్చే నెల 5 వరకు దరఖాస్తుల స్వీకరణ

  • ఆగస్టు 5 నుంచి పరీక్షలు

  • సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత, ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులు

  • నరసన్నపేట, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహణకు విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2011కు ముందు టెట్‌ రాయకుండా నియమితులై సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులతో పాటు డీఎస్సీకి హాజరయ్యే అభ్యర్థులకు ఈ పరీక్ష నిర్వహించనుంది. శుక్రవారం నుంచి జూలై 5 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఆగస్టు 5 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహించనుంది. ఈ ఏడాది అక్టోబరులో డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో నిరుద్యోగ యువత ఉపాధ్యాయ పోస్టులు దక్కించుకునేందుకు టెట్‌ దోహదపడుతుంది. ఈ మేరకు నిరుద్యోగ యువత, ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులు కొంతమంది టెట్‌కు సిద్ధమవుతున్నారు.

  • 2011 నుంచి టెట్‌ అమల్లోకి వచ్చింది. అంతకంటే ముందు ఉద్యోగాలు పాందిన టీచర్లు కచ్చితంగా టెట్‌ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు కొన్నాళ్ల కిందట తీర్పునిచ్చింది. దీనిపై కొంతమంది ఉపాధ్యాయులు రివ్యూ పిటిషన్‌ వేశారు. కాగా విద్యాహక్కు చట్టం అమల్లోకి రాకముందు నియమితులై ఐదేళ్లకుపైగా సర్వీసు ఉన్న టీచర్లు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్‌ పాస్‌ కావాలని మరోసారి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాలో వివిధ మేనేజ్‌మెంట్‌ పాఠశాలల్లో 14,300 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో సుమారు 9,800 మంది ఉపాధ్యాయులు 2011 ముందే నియామకం పొందారు. వీరిలో గతేడాది డిసెంబరులో నిర్వహించిన టెట్‌కు కేవలం 14శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 5 శాతం మాత్రమే అర్హత సాధించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయా ఉపాధ్యాయులు కూడా టెట్‌కు సన్నద్ధమవుతున్నారు.

  • మార్గదర్శకాలు ఇలా..

  • 150 మార్కులకు రెండున్నర గంటల వ్యవధితో ఉండే ఈ పరీక్షలో అర్హత సాధించడానికి ఓసీ కేటగిరీ అభ్యర్థులు 90మార్కులు (60శాతం) సాధించాలి. బీసీలు 75మార్కులు (50శాతం) ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు 60మార్కులు (40శాతం) సాధించాల్సి ఉంటుంది.

  • టెట్‌ రాసేందుకు ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులు 2011కు ముందు ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేసిన వారికి ఓసీలు అయితే 45శాతం, ఎస్సీ,ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40శాతం మార్కులు ఉండాలి. బీఈడీ, డీఈడీలో అయితే టెట్‌ రాసేందుకు ఎటువంటి అర్హత మార్కులు లేవని మార్గదర్శకాలు జారీచేశారు.

  • పెరగనున్న పోటీ

  • ఈసారి టెట్‌కు పోటీ గణనీయంగా పెరగనుంది. గతేడాది డిసెంబరులో నిర్వహించిన టెట్‌కు డీఎస్సీ రాసే అభ్యర్థులే 86శాతం వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు మినహా మిగిలిన ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులందరూ టెట్‌ తప్పనిసరిగా రాయాల్సి ఉంది. జిల్లాలో సుమారు 8వేల మందికిపైగా ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులు టెట్‌ రాయనున్నారు. వీరితోపాటు నిరుద్యోగ యువత, గతంలో టెట్‌ రాసిన అభ్యర్థులు కూడా స్కోరింగ్‌ కోసం మళ్లీ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. మొత్తంగా జిల్లాలో 20వేల మందికిపైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

  • ప్రత్యేకంగా నిర్వహించాలి

  • ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులకు టెట్‌ ప్రత్యేకంగా నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ‘ఐదు పదుల వయసులో ప్రతీ సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవడం చాలా కష్టం. ఇంటర్‌, డిగ్రీలు పూర్తిచేసి 30సంవత్సరాలు దాటుతోంది. ఆయా సబ్జెక్టులు మళ్లీ చదవాలంటే వయసుకు భారంగా మారుతుంది. ఉపాధ్యాయులు బోధించే సిలబస్‌కు అనుగుణంగా టెట్‌ నిర్వహించాల’ని వారు విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు.

Updated Date - Jun 06 , 2026 | 12:14 AM