Share News

నేటి నుంచి టెట్‌

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:40 PM

TET in seven centers from today ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం నుంచి ఈ నెల 21 వరకూ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 12,593 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

నేటి నుంచి టెట్‌
నరసన్నపేటలో పరీక్ష కేంద్రం

ఏడు కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం నుంచి ఈ నెల 21 వరకూ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 12,593 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి జిల్లాలో నాలుగు, ఒడిశాలో మూడు పరీక్షా కేంద్రాలను కేటాయించారు. ఎచ్చెర్లలోని శ్రీశివానీ, శ్రీవెంకటేశ్వర, నరసన్నపేటలోని కోర్‌ టెక్నాలజీస్‌, టెక్కలిలో ఐతమ్‌ కళాశాలలతోపాటు.. బరంపురంలోని స్మిత్‌ అసిస్టెంట్‌ ఎగ్జామినేషన్‌ సెంటర్‌, ఐవోఎస్‌ డిజిటల్‌ జోన్‌, గవర్నమెంట్‌ ఐటీఐ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్‌ బేసిడ్‌(సీబీటీ) విధానంలో రెండు పూటలా జరిగే ఈ పరీక్షల పర్యవేక్షణకు ఎంఈవోలను డిపార్ట్‌మెంటల్‌ అధికారులుగా నియమించారు. ప్రతీ నాలుగు కేంద్రాలకు ఇద్దరు డిప్యూటీ డీఈవో నేతృత్వంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలుతోపాటు బందోబస్తు, ఎస్కార్ట్‌ సౌకర్యం సిద్ధం చేశారు. విద్యుత్‌ సరఫరాకు విఘాతం లేకుండా చర్యలు చేపట్టారు. ప్రతి కేంద్రం వద్ద వైద్యసేవలు అందించేందుకు ఆరోగ్యశాఖ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థుల రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. శ్రీకాకుళం, నరసన్నపేట, ఎచ్చెర్ల, లావేరు విద్యాశాఖ అధికారులకు పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. అభ్యర్థులు పరీక్షాకేంద్రానికి నిర్ణీత సమయానికి గంటన్నర ముందు రిపోర్టు చేయాలి. హాల్‌ టిక్కెట్‌తోపాటు ఆధార్‌కార్డును తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.

Updated Date - Aug 04 , 2026 | 11:40 PM