రేపటి నుంచి పది పరీక్షలు
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:58 PM
Tenth exams.. get ready పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరగనున్నాయి. జిల్లాలో 145 కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
145 కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు
28,586 మందికి హాల్‌టిక్కెట్లు జారీ
ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం
నరసన్నపేట, మార్చి 14(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరగనున్నాయి. జిల్లాలో 145 కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 28,586 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటికే విద్యార్థులందరికీ హాల్‌టిక్కెట్లు జారీచేశారు. పోలీసు స్టేషన్ల నుంచి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను తరలించేందుకు 33 వాహనాలను అందుబాటులో ఉంచారు. చూచిరాతలకు అవకాశమున్న ఎనిమిది కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. పరీక్షా కేంద్రానికి 200 మీటర్లు వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. సమీపంలోని జిరాక్స్, ఇంటర్‌నెట్ కేంద్రాలను మూసివేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులతోపాటు ఇన్విజలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్ అధికారులకు మాత్రమే అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి ఒక్క సీఎస్‌కు మాత్రమే సెల్‌ఫోన్ అనుమతి ఉంది. ఇన్విజిలేటర్లు వద్ద తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ఉండాలి. విద్యార్థులను 8.45 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. హాల్‌టిక్కెట్ చూపించి.. విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
‘జిల్లాలో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తిచేశామని డీఈవో ఏ.రవిబాబు తెలిపారు. శనివారం శ్రీకాకుళంలోని డీఈవో కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘జిల్లాలో 145 పరీక్షా కేంద్రాల్లో 145 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 145మంది డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించాం. ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించనున్నాయి. 8 కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు సిద్ధం చేశాం. విద్యార్థులు నిర్ణీత సమయానికి అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షలు ప్రశాంతంగా రాయాల’ని తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ జి.చంద్రభూషణ్ పాల్గొన్నారు.
ఒత్తిడికి గురికావొద్దు: కలెక్టర్
పదో తరగతి విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్షలు అత్యంత కీలకమైనవని, ప్రతీ విద్యార్థి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని, విద్యార్థులు గడువు కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.