నేటి నుంచి పది పరీక్షలు
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:45 PM
Tenth exams జిల్లాలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరగనున్నాయి. 145 కేంద్రాల్లో 28,598 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం/ నరసన్నపేట, మార్చి 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరగనున్నాయి. 145 కేంద్రాల్లో 28,598 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అఽధికారులు సూచించారు. ఉదయం 10గంటలు వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల్లో బెంచీలు, తాగునీరు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్ష పత్రాలను తరలించే వాహనాలకు ట్యాగ్‌ను అనుసంధానం చేశారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, సీసీ కెమెరాల నిఘా నడుమ పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ప్రశాంతంగా నిర్వహణకు చర్యలు:
జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేలా పటిష్ఠ చర్యలు చేపట్టామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహించనున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదివారం పలు సూచనలు చేశారు. ‘జిల్లాలో పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్ఠంగా అమలు చేయాలి. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలు, ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలు కట్టదిట్టమైన నిఘా కొనసాగించాలి. పరీక్షా కేంద్రాల లోపలకు ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఐప్యాడ్‌లు, ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలు అనుమతించరాదు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్లు పరీక్షలు పూర్తయ్యే వరకు మూసివేయాల’ని ఎస్పీ ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని తెలిపారు.