ప్రజా సంఘాల ఆందోళనతో ఉద్రిక్తత
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:55 PM
ప్రజా సంఘాల నాయకులు సోమవారం చేపట్టిన జైలుభరో కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
పలాస, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ప్రజా సంఘాల నాయకులు సోమవారం చేపట్టిన జైలుభరో కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీనికి సంబంధించిన వివరాలివీ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజా, రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సోమవారం రైతు, కార్మిక, ప్రజాసంఘాలు రాష్ట్రవ్యాప్తంగా జైలుభరో కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ మేరకు పలాస రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి కాశీబుగ్గ వరకూ ర్యాలీ నిర్వహించేందుకు సంబంధిత నాయకులు యత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకొని...దారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనిపై ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. తాము శాంతియుతంగా ర్యాలీ చేస్తామని, అనుమతి ఇవ్వాలని వారు కోరినా పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బారికేడ్లను తోసుకుంటూ ఆందోళనకారులు రోడ్డుకెక్కారు. అనంతరం కాశీబుగ్గ బస్టాండు ప్రాంతంలో ఆందోళన చేస్తున్న సమయంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిల వినోద్ కుమార్ మెడలో ఉన్న కండువాను వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ నిహార్ గట్టిగా పట్టుకోవడంతో ఆయన దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఆందోళనకారులంతా ఆయనకు మద్దతు తెలిపి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఇన్‌చార్జి సీఐ రామకృష్ణ వారికి నచ్చజెప్పారు. పక్కకు తప్పించే ప్రయత్నంలో జరిగిందని వివరణ ఇవ్వడంతో వారంతా శాంతించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అమెరికాతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిర్బంధ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకుడు కె.మోహనరావు, లిబరేషన్ నాయకుడు తామాడ సన్యాసిరావు, న్యూడెమోక్రసీ నాయకుడు వంకల మాధవరావు, పౌర హక్కుల సంఘం నాయకులు పత్రి దానేసు, ఏఐకేఎం నాయకుడు మద్దిల రామారావు, సీఐటీయూ నాయకుడు ఎన్.గణపతి, వి.ముకుందరావు, టి.అజయ్‌కుమార్, కోనేరు రమేష్, పి.దుర్యోధన, పి.కుసుమ, ఈశ్వరమ్మ, సుహాసిని, శశిరేఖ, పుణ్యవతి పాల్గొన్నారు.
ఒప్పందాన్ని రద్దుచేయాలి
టెక్కలి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేసి కనీస వేతనాలు రూ.35 వేలకు పెంచాలని వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం టెక్కలిలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ర్యాలీ నిర్వహించాయి. అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద మానవహారాలు ఏర్పాటు చేసి తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ మోర్చా నాయకులు కోత మధు, రైతు సంఘం నాయకులు బగాది వాసు, వ్యవసాయ కార్మిక సంఘం నుంచి కొల్లి ఎల్లయ్య, సీఐటీయూ నుంచి నంబూరు షణ్ముఖరావు, హనుమంతు ఈశ్వరరావు, పాలవలస ధర్మారావు, తమ్మినేని వైకుంఠరావు, టీబీజీ గుప్త, పొట్నూరు ఆనందరావు, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.