చలో కలెక్టరేట్ ఉద్రిక్తం
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:40 AM
Scheme workers' protest and agitation కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరుతూ అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ శానిటేషన్ తదితర స్కీంవర్కర్లు సీఐటీయు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘చలో కలెక్టరేట్’ ఉద్రిక్తంగా మారి అరెస్టులకు దారి తీసింది.
కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాల్సిందే
స్కీంవర్కర్ల ధర్నా.. ఆందోళన
పరిస్థితి అదుపు చేసిన పోలీసులు
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 31(ఆంధ్రజ్యోతి): కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరుతూ అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ శానిటేషన్ తదితర స్కీంవర్కర్లు సీఐటీయు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘చలో కలెక్టరేట్’ ఉద్రిక్తంగా మారి అరెస్టులకు దారి తీసింది. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు ఆర్‌్క్షబీ బంగ్లా నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధర్నా చేశారు. ‘పెరిగిన ధరలకు అనుగుణంగా గత ఏడేళ్లుగా స్కీం వర్కర్లకు వేతనాలు పెంచలేదు. డీఏ కూడా అమలు చేయడం లేదు. రాజకీయ వేధింపులు ఆపాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. మెనూచార్జీలు పెంచాల’ని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరపున కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్ లోపలకు చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి, తోపులాటకు దారి తీసింది. దీంతో పోలీసులు ముఖ్య నాయకులను అరెస్టు చేసి ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ తోపులాటలో ఓ కార్మికురాలు సొమ్మసిల్లి పడిపోగా మహిళా పోలీసులు సపర్యలు చేశారు. అరెస్టయిన వారిలో సీఐటీయూ నాయకులు తేజేశ్వరరావు, అమ్మన్నాయుడు, నాగమణి, అల్లు మహాలక్ష్మి, అల్లు సత్యనారాయణ, ఎన్‌వి.రమణ, డి.ధనలక్ష్మి, జి.అమరావతి, డి.సుధ, చంద్రమౌళి, కె.సుశీల, బి.ఉత్తర, టి.ప్రవీణ, ఎన్.పద్మ, బి.చంద్రకళ, ఎన్.హైమవతి, వి.హేమలత, కాంచన, దమయంతి, తదితరులు ఉన్నారు.