Share News

ఆమోదం లేకుండా.. టెండర్లు కట్టబెట్టి

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:21 AM

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి ఉద్దానం రక్షిత మంచినీటి పథకం పైపులైన్‌ను అనుసంధానించేందుకు ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక నిధులు రూ.60 లక్షలు మంజూరు చేసింది.

ఆమోదం లేకుండా.. టెండర్లు కట్టబెట్టి
ఉద్దానం పైపులైన్‌కు మరమ్మతులు చేస్తున్న దృశ్యం(ఫైల్‌)

‘ఉద్దానం’ పనులపై ఇంజనీరింగ్‌ అధికారి అత్యుత్సాహం

పాలకవర్గం నుంచి అభ్యంతరం

రూ.60లక్షలు వినియోగించకుండా ఉండిపోయిన వైనం

తప్పులు కప్పిపుచ్చుకోవడానికి సాధారణ నిధులతో పనులు

పలాస, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి ఉద్దానం రక్షిత మంచినీటి పథకం పైపులైన్‌ను అనుసంధానించేందుకు ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక నిధులు రూ.60 లక్షలు మంజూరు చేసింది. కానీ, ఒక ఇంజనీరింగ్‌ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించి పాలకవర్గం ఆమోదం లేకుండానే ఓ కాంట్రాక్టర్‌కు టెండర్లు కట్టబెట్టారు. దీనిపై అభ్యంతరాలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఈ పనుల కోసం ప్రత్యేక నిధులు కాకుండా సాధారణ నిధులను దుర్వినియోగం చేశారనే విమర్శలు ఉన్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్‌, మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో ఒక చోట చేపట్టాల్సిన పనులను మరోచోట చేశారనే విమర్శలు ఉన్నాయి.

ఇదీ పరిస్థితి..

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ మీదుగా జలజీవన్‌ మిషన్‌ పైపులైన్లు వెళ్తున్నా ఈ ప్రాంతానికి చుక్కనీరు అందడం లేదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం ఉద్దానం రక్షిత మంచినీటి పథకం వినియోగించుకోవాలని చెప్పి అందుకు అవసరమైన నిధులు రూ.60లక్షలు విడుదల చేసింది. ఈ నిధులతో ఉద్దానం పైపులైన్‌ మరమ్మతులతో పాటు, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి వచ్చే పైపులైన్‌ను ప్రధాన పైపులైన్‌కు అనుసంధానించే పనులు చేపట్టాల్సి ఉంది. అయితే, నిధుల ఖర్చుకు సంబంధించి మునిసిపాలిటీ పాలకవర్గం ఆమోదం పొందాల్సి ఉంది. కానీ, ఓ ఇంజనీరింగ్‌ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించి పాలకులకు తెలియకుండానే టెండర్లు పిలవడం, విజయనగరానికి ఓ కాంట్రాక్టర్‌కు వాటిని కట్టబెట్టడం చకాచకా జరిగిపోయాయి. దీనిపై పాలకవర్గం అభ్యంతరం వ్యక్తంచేసింది. అభివృద్ధి పనులకు తాము ఆటంకం కాదని, నిబంధనల ప్రకారం చేయాలని సూచించింది. ఇందుకు అధికారులు అంగీకరించారు. ఈ మేరకు టెండరు ప్రక్రియను ప్రారంభించారు. అయితే, ఏం జరిగిందో గాని ఉద్దానం పైపులైన్ల మరమ్మతులకు జనరల్‌ ఫండ్‌ నుంచి రూ.15లక్షలు కేటాయించి సంబంధిత కాంట్రాక్టర్‌కు చెల్లించారు. పాత పనులకు మరమ్మతుల పేరుతో వీటిని నిర్వహించడం విశేషం. ప్రస్తుతం ఈ పనులు పూర్తయ్యాయి. గతంలో ఈ పనులకు రూ.60 లక్షలు అవసరమని అంచనా వేసుకుని.. ఇప్పుడు కేవలం రూ.15 లక్షలతో ఏ విధంగా చేపట్టారో ఇంజనీరింగ్‌ అధికారులకే తెలియాలి. ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక నిధులు రూ.60 లక్షలు ఖర్చు చేయకుండా జనరల్‌ ఫండ్‌ను ఎందుకు వినియోగించాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది.

కోసంగిపురం వద్ద ఉన్న ఉద్దానం రక్షిత పథకం ప్రధాన పైపులైన్‌ నుంచి పద్మనాభపురం మీదుగా పలాస-కాశీబుగ్గకు తాగునీటిని తీసుకురావాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఆలోచన చేశారు. కానీ, మునిసిపల్‌ అధికారులు మాత్రం కాశీబుగ్గ మూడు రోడ్ల జంక్షన్‌ వద్ద ఉన్న వజ్రపుకొత్తూరు మండలానికి వెళ్లే పైపులైన్‌ నుంచి నీటిని వినియోగించుకుంటున్నారు. ఆర్‌ డబ్ల్యూఎస్‌, మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ప్రస్తుతం పలాస, కాశీబుగ్గలో ఉన్న ఉద్దానం రక్షిత ట్యాంకులకు కొత్త పైపులైన్లు వేస్తేనే తప్పా పూర్తిస్థాయి నీటి వినియోగం జరగదని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. మొత్తం 7 కిలోమీటర్ల పొడవునా కొత్త పైపులైను వేయడానికి అంచనా వేశారు. ప్రత్యేక నిధులు రూ.60 లక్షలు, మునిసిపల్‌ జనరల్‌ ఫండ్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంటులో రూ.47లక్షలు ఖర్చు చేసేందుకు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నిధులు విడుదలైతే అదనంగా పైపులైన్లు వేయడానికి అవకాశం ఉంటుంది.

నిధులు దుర్వినియోగం చేశారు..

ఇంజనీరింగ్‌ విభాగం పనితీరు అస్తవ్యస్తంగా ఉంది. దాన్ని గాడిలో పెడుతున్నాం. పరిపాలన ఆమోదం లేకుండా రూ.60 లక్షలు టెండర్లు పిలిచారు. ప్రజాప్రతినిధులను తప్పుదోవ పట్టించారు. రూ.15 జనరల్‌ ఫండ్‌ నిధులు వెచ్చించి టెండర్లు లేకుండా ఉద్దానం పైపులైన్లను మరమ్మతులు చేయించారు. ప్రత్యేక నిధులు ఉండగా జనరల్‌ ఫండ్‌ను దుర్వినియోగం చేశారు. కాంట్రాక్టర్లు, పనులకు ఇబ్బంది పెట్టకూడదని మౌనం దాల్చాం.

-బళ్ల గిరిబాబు, చైర్మన్‌, పలాస-కాశీబుగ్గ

Updated Date - Feb 15 , 2026 | 12:21 AM