Share News

కౌలురైతుల కష్టాలు

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:06 AM

Unissued CCR cards వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా.. భూ యజమానుల తీరుతో కౌలు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఖరీఫ్‌ సాగుకు సంబంధించి విత్తనాల పంపిణీ ప్రారంభం కాగా.. జిల్లాలో కౌలు రైతులకు మంజూరు చేస్తున్న సాగుహక్కు పత్రాలు పది శాతం కూడా పూర్తికాలేదు. దీంతో కౌలురైతులు ఆందోళన చెందుతున్నారు.

కౌలురైతుల కష్టాలు

  • పది శాతం కూడా జారీ కానీ సీసీఆర్‌ కార్డులు

  • సాగుహక్కు పత్రాలు ఇవ్వని భూ యజమానులు

  • ప్రభుత్వ సహకారంపై ఆందోళన

  • కంచిలి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా.. భూ యజమానుల తీరుతో కౌలు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఖరీఫ్‌ సాగుకు సంబంధించి విత్తనాల పంపిణీ ప్రారంభం కాగా.. జిల్లాలో కౌలు రైతులకు మంజూరు చేస్తున్న సాగుహక్కు పత్రాలు పది శాతం కూడా పూర్తికాలేదు. దీంతో కౌలురైతులు ఆందోళన చెందుతున్నారు. భూ యజమాని నుంచి కౌలు రైతులు సాగు హక్కు పొందేలా పత్రాలు తీసుకుని, సీసీఆర్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. కానీ గ్రామస్థాయిలో భూ యజమానులు కౌలు రైతులకు ఈ పత్రాలు అందించేందుకు విముఖత చూపుతున్నారు. సాగు హక్కు పత్రాలు ఇస్తే భవిష్యత్‌లో కౌలు రైతుల నుంచి తమ భూములకు ఏమైనా ఇబ్బందులు తలెత్తవచ్చని సందేహ పడుతున్నారు. దీంతో సాగుహక్కు పత్రాలు ఇవ్వడం లేదు. దీనిపై అధికారులు గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించినా మార్పు కనిపించడం లేదు. జిల్లాలో వేలాది మంది కౌలురైతులు ఉండగా.. ఇప్పటివరకూ కేవలం 177 మందికి సీసీఆర్‌ కార్డులు మంజూరు చేశారు.

  • సోంపేట డివిజన్‌లోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో 913 సీసీఆర్‌ కార్డుల మంజూరు లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటివరకు కేవలం 80 కార్డులే మంజూరయ్యాయి.

  • పలాస డివిజన్‌లో 1,348 కార్డులకుగానూ కేవలం 32 సీసీఆర్‌ కార్డులు మాత్రమే ఇచ్చారు.

  • టెక్కలి డివిజన్‌లో 2,248 సీసీఆర్‌ కార్డులకుగానూ కేవలం 8 మాత్రమే మంజూరయ్యాయి.

  • నరసన్నపేట డివిజన్‌లో 1,702 సీసీఆర్‌ కార్డులు మంజూరు చేయాల్సి ఉండగా.. 11 కార్డులు మాత్రమే అందజేశారు.

  • శ్రీకాకుళం డివిజన్‌లో 1,285 సీసీఆర్‌ కార్డులకుగానూ 38 కార్డులు మంజూరు చేశారు.

  • సాంకేతిక సమస్యలు

  • కౌలు రైతులకు సాగుహక్కు పత్రాల మంజూరులో సాంకేతిక సమస్యలు కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో చేసిన భూ సర్వేలో తప్పుడు వివరాలు నమోదు కారణంగా ప్రస్తుతం కౌలుదారులకు కార్డుల మంజూరులో జాప్యమవుతోంది. అప్పట్లో ఒకే ఎల్‌పీ నెంబర్లకు రెండు వేర్వేరు భూ యజమానుల భూములను కలిపి నమోదు చేశారు. ఒకరి భూమికి వేరొకరి ఆధార్‌ నెంబర్‌ జత చేయడం వంటి సమస్యల కారణంగా ప్రస్తుతం సీసీఆర్‌ కార్డుల మంజూరు ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు.

  • వెబ్‌సైట్‌లో నమోదు కాక ఆందోళన

  • ప్రభుత్వం ఈ ఏడాది రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల పంపిణీకి సంబంధించి సాంకేతిక అంశాలకు ముడి పెట్టడంతో కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు తమకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం ముందుగా ఏపీఏఐఎంఎస్‌ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలి. పేరు నమోదు చేసుకున్న వెంటనే సదరు రైతుకు సంబంధించిన భూమి వివరాలు, సాగు విస్తీర్ణం తెలుస్తాయి, ఆ ప్రాప్తికి అధికారుల సిఫారసు మేరకు ఎరువులు, విత్తనాలను కేటాయించిన రైతు సేవా కేంద్రం నుంచి తీసుకోవాలి. కాగా ఇప్పటి వరకు సీసీఆర్‌ కార్డులు మంజూరు చేయకపోవడంతో వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు కావడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు విత్తనాలు, ఎరువులు ఎలా అందుతాయని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

  • అర్హులందరికీ మంజూరు

  • జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 177 మంది కౌలు రైతులకు సీసీఆర్‌ కార్డులు మంజూరు చేశాం. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించాం. రైతులు తమ భూ యజమానుల నుంచి అంగీకార పత్రాలు తెచ్చి, దరఖాస్తు చేసుకుంటే అర్హులందరికీ తప్పకుండా కార్డులు మంజూరు చేస్తాం.

  • - వైవీ మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయశాఖాధికారి

  • ---------------------------------

  • సీసీఆర్‌ కార్డుల ప్రక్రియ ఇలా

  • ---------------------------------

  • మండలం లక్ష్యం మంజూరు

  • -----------------------------------------------------

  • ఇచ్ఛాపురం 150 2

  • కవిటి 327 2

  • కంచిలి 186 6

  • సోంపేట 250 70

  • మందస 406 25

  • పలాస 214 -

  • వజ్రపుకొత్తూరు 181 -

  • మెళియాపుట్టి 547 7

  • నందిగాం 501 -

  • టెక్కలి 556 -

  • సంతబొమ్మాళి 233 -

  • కోటబొమ్మాళి 210 -

  • పాతపట్నం 748 8

  • నరసన్నపేట 373 -

  • పోలాకి 466 1

  • జలుమూరు 510 3

  • సారవకోట 353 7

  • శ్రీకాకుళం 308 -

  • గార 312 -

  • ఆమదాలవలస 575 10

  • ఎచ్చెర్ల 90 28

Updated Date - Jun 28 , 2026 | 12:06 AM