కేజీబీవీలో మరో పది మందికి అస్వస్థత
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:25 AM
Ten female students fall ill గార మండలం శాలిహుండంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో శనివారం మరో పది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం 13 మంది, గురువారం 8 మంది విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురికాగా.. కేజీబీవీ సిబ్బంది గార పీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్యసేవలు అందించిన విషయం తెలిసిందే.
‘శాలిహుండం’లో కొనసాగుతున్న వైద్యశిబిరం
గార/ కోటబొమ్మాళి, జూలై 11(ఆంధ్రజ్యోతి): గార మండలం శాలిహుండంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో శనివారం మరో పది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం 13 మంది, గురువారం 8 మంది విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురికాగా.. కేజీబీవీ సిబ్బంది గార పీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్యసేవలు అందించిన విషయం తెలిసిందే. నాణ్యతలేని ఆహారం పెట్టడమే విద్యార్థినుల అస్వస్థతకు కారణమని అధికారుల విచారణలో తేలింది. కాగా.. ఆ విద్యార్థినులు కోలుకున్నారు. శుక్రవారం మళ్లీ ముగ్గురు అస్వస్థతకు గురికాగా.. శనివారం మరో పది మంది విద్యార్థినులు డయేరియా లక్షణాలతో బాధపడడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గార పీహెచ్‌సీ వైద్యాధికారిణి సోనియా, ఇతర వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. విద్యార్థినులు త్వరగా కోలుకునేలా మెరుగైన సేవలు అందజేస్తున్నామని డాక్టర్ సోనియా తెలిపారు. విద్యార్థినులకు పరీక్షలు చేసి ల్యాబ్‌కు పంపించామన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోండి: మంత్రి అచ్చెన్న ఆదేశం
శాలిహుండంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉదంతంపై శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఏపీసీ వేణుగోపాలరావుతో ఫోన్‌లో వివరాలు ఆరా తీశారు. షౌష్టికాహారం తిని విద్యార్థినులు అనారోగ్యానికి గురికావడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. విద్యార్థినులకు మెరుగైన బోధనతోపాటు నాణ్యమైన షౌషకాహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. నిర్లక్ష్యానికి కారణమైన బాధ్యులను తక్షణమే సస్పెండ్ చేయాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం సమగ్ర శిక్ష అధికారులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. పాఠశాలలో భోజన, వసతి, అందుతున్న ఆహార నాణ్యత, విద్యార్ధుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, విధుల్లో అలసత్వం వహించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.