Share News

ట్రిపుల్‌ఐటీలో సిబ్బందిపై వేటు

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:12 AM

IIIT staff suspended ఎచ్చెర్ల మండలం ఎస్‌.ఎం.పురంలోని ట్రిపుల్‌ఐటీ (ఆర్జీయూకేటీ, శ్రీకాకుళం క్యాంపస్‌)లో కాంట్రాక్ట్‌ సిబ్బందిపై వేటు పడింది. ఇటీవల విద్యార్థినులపై వేధింపుల ఫిర్యాదు నేపథ్యంలో సుమారు పది మంది బోధనా, భోదనేతర సిబ్బందిని సస్పెన్షన్‌ చేశారు.

ట్రిపుల్‌ఐటీలో సిబ్బందిపై వేటు

విద్యార్థినుల వేధింపుల ఫిర్యాదుపై పదిమంది సస్పెన్షన్‌

ఎచ్చెర్ల, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల మండలం ఎస్‌.ఎం.పురంలోని ట్రిపుల్‌ఐటీ (ఆర్జీయూకేటీ, శ్రీకాకుళం క్యాంపస్‌)లో కాంట్రాక్ట్‌ సిబ్బందిపై వేటు పడింది. ఇటీవల విద్యార్థినులపై వేధింపుల ఫిర్యాదు నేపథ్యంలో సుమారు పది మంది బోధనా, భోదనేతర సిబ్బందిని సస్పెన్షన్‌ చేశారు. గతేడాది డిసెంబరులో విద్యార్థినులను కొంతమంది సిబ్బంది వేధిస్తున్నారని ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులకు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు అందింది. దీంతో అదే నెల 17న రాష్ట్ర మహిళా కమిషన్‌ చైౖర్‌పర్సన్‌ రాయపాటి శైలజ, ఆర్జీయూకేటీ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కె.మధుమూర్తి వేర్వేరుగా క్యాంపస్‌ను పరిశీలించారు. విద్యార్థినులు, సిబ్బందితో మాట్లాడారు. తర్వాత క్యాంపస్‌లో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ విచారణ చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 18,19 తేదీల్లో ఆరుగురు సభ్యులతో మరో కమిటీ రెండు రోజులపాటు విచారణ చేసింది. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడున్నట్టు 14 మంది కాంట్రాక్ట్‌ బోధనా, బోధనేతర సిబ్బంది ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరి నుంచి కమిటీ సభ్యులు రాతపూర్వకంగా వివరణ తీసుకున్నారు. కమిటీ నివేదిక ఆధారంగా సుమారు 10 మంది కాంట్రాక్ట్‌ సిబ్బందిని విధుల నుంచి సస్పెన్షన్‌ చేస్తూ ఆర్జీయూకేటీ ప్రధాన కార్యాలయం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందికి వ్యక్తిగతంగా శుక్రవారం మెయిల్స్‌ వచ్చాయి. వ్యక్తిగతంగా మెయిల్స్‌ చేరడంతో ఎంతమందిని సస్పెన్షన్‌ చేశారన్న విషయమై స్పష్టత లేదు. తదుపరి ఉత్తర్వులు విడుదలయ్యే వరకు క్యాంపస్‌లో ఉండొద్దని కూడా మెయిల్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

Updated Date - Mar 21 , 2026 | 12:12 AM