Share News

తెలుగే నా బలం

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:12 AM

Ability in Civil Services ‘నా విద్యాభ్యాసం అంతా తెలుగులోనే సాగింది. అందుకే ఇంగ్లీష్‌ కంటే తెలుగులోనే నా బలం ఉందని నమ్మాను. సివిల్స్‌ను తెలుగులో రాయడం కష్టతరమైనప్పటికీ నా నిర్ణయానికి కట్టుబడి విజయాన్ని సాధించాను’ అని సివిల్స్‌లో 463వ ర్యాంకు సాధించిన సరోతు రాము అన్నారు.

తెలుగే నా బలం

సివిల్స్‌లో సత్తా చాటిన సిక్కోలు బిడ్డ

463వ ర్యాంకు సాధించిన సరోతు రాము

అండగా నిలిచిన నిరక్షరాస్యురాలైన తల్లి

శ్రీకాకుళం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ‘నా విద్యాభ్యాసం అంతా తెలుగులోనే సాగింది. అందుకే ఇంగ్లీష్‌ కంటే తెలుగులోనే నా బలం ఉందని నమ్మాను. సివిల్స్‌ను తెలుగులో రాయడం కష్టతరమైనప్పటికీ నా నిర్ణయానికి కట్టుబడి విజయాన్ని సాధించాను’ అని సివిల్స్‌లో 463వ ర్యాంకు సాధించిన సరోతు రాము అన్నారు. సివిల్స్‌లో ఈ ర్యాంకు రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రజ్యోతితో ఆయన తన ప్రిపరేషన్‌, కుటుంబం గురించి పంచుకున్నారు. ‘ఎప్పటికీ వదులుకోకూడదు (నెవర్‌ గివింగ్‌ అప్‌)’ అనే దృక్పథమే తన విజయ రహస్యమని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలని, సమాజానికి తనవంతుగా ఏదైనా తిరిగి ఇవ్వాలని అనుకున్నానని చెప్పారు.

అమ్మ చదువుకోకపోయినా.. కొండంత అండగా..

‘మాది ఓ సామాన్య వ్యవసాయ కుటుంబం. 2019లో నాన్న చనిపోయారు. అప్పటినుంచి అమ్మే ఇంటికి పెద్దదిక్కు, ఆమె సంపాదనే మాకు ఆధారం. ఆమెకు కనీస పాఠశాల విద్య కూడా లేదు. నేను ఏం చదువుతున్నానో, ఈ పరీక్షల విధానం ఏమిటో కూడా ఆమెకు తెలియదు. అయినా సరే నాపై నమ్మకంతో కొండంత అండగా నిలబడి మద్దతు ఇచ్చింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో స్నేహితులు నాకు అన్ని విధాలా తోడుగా నిలిచారు. ప్రిపరేషన్‌ పరంగానే కాకుండా మానసికంగా, ఆర్థికంగా వారు చేసిన సాయం మరువలేనిది. అమ్మ, స్నేహితుల మద్దతు లేకపోతే ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు’

నాలుగో ప్రయత్నంలో.. తొలి ఇంటర్వ్యూలోనే..

‘ఇది నాలుగో ప్రయత్నం. రెండోసారి మెయిన్స్‌ రాశాను. అయితే ఇంటర్వ్యూకి వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి. తొలి ఇంటర్వ్యూలోనే విజయం సాధించడం ఆనందంగా ఉంది’ అని రాము తెలిపారు.

Updated Date - Mar 08 , 2026 | 12:12 AM