Share News

సాంకేతికత.. పారదర్శకత

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:17 AM

Fertilizer distribution through APAIMS app సాగుకు సంబంధించి విచ్చలవిడిగా ఎరువుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దిగుబడి అధికంగా వస్తుందనే అపోహతో రైతులు పంటలకు పరిమితికి మించి ఎరువులను వినియోగిస్తున్నారు.

సాంకేతికత.. పారదర్శకత

ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ ద్వారా ఎరువుల పంపిణీ

ఎకరాకు 75కేజీల యూరియా, బస్తా డీఏపీకి పరిమితం

క్షేత్రస్థాయిలో రైతుల వివరాల నమోదు

టెక్కలి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): సాగుకు సంబంధించి విచ్చలవిడిగా ఎరువుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దిగుబడి అధికంగా వస్తుందనే అపోహతో రైతులు పంటలకు పరిమితికి మించి ఎరువులను వినియోగిస్తున్నారు. దీనివల్ల భూసారం కోల్పోతోంది. మరోవైపు ఎరువులు కూడా పక్కదారి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వైపు భూసారాన్ని రక్షించేలా, మరోవైపు ఎరువులు పక్కదారి పట్టకుండా పారదర్శకత పాటించేలా సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ అగ్రికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఏపీఏఐఎంఎస్‌) అనే యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై ఈ యాప్‌ ద్వారా మాత్రమే రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులను విక్రయించాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశించింది. రైతుల ఆధార్‌కార్డుకు లింక్‌ అయిన వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా ఎకరాకు 75 కేజీల యూరియా, ఒక బస్తా డీఏపీని మాత్రమే అందజేస్తారు. రైతుసేవా కేంద్రాలు, ఎరువల డీలర్లు ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో గ్రామీణ వ్యవసాయ సహాయకులు ఖరీఫ్‌-2026 పేరిట పంట నమోదు ప్రక్రియను చేపడుతున్నారు. ఆటోమొబైల్‌ యాప్‌లో రైతుకు ఎంత భూమి ఉంది. ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారు, ఏ మేరకు ఎరువులు అవసరం ఉంటుందో గుర్తించి సరఫరా చేస్తారు.

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో నాలుగు లక్షల ఎకరాలకుపైగా వరిసాగు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యవసాయాధికారులు 8,770 మెట్రిక్‌టన్నులు యూరియా, 2,769 మెట్రిక్‌టన్నుల డీఏపీ సిద్ధం చేశారు. ఈ ఎరువులను ఏపీఏఐఎంఎస్‌ విధానం ద్వారా సరఫరా చేయనున్నారు. జిల్లాలో రెండు మండలాల్లో అధిక యూరియా వినియోగం వలన ఇప్పటికే భూసారం కోల్పోయింది. దీంతో యూరియా వినియోగంపై అనేక ఆంక్షలు వెలువడుతున్నాయి. అర్హులైన రైతులకు 20 రోజుల వ్యవధి చొప్పున మూడు విడతల్లో నిబంధనల మేరకు సంబంధిత యాప్‌ ద్వారా ఎరువులు సరఫరా చేస్తారు. పారదర్శకత కోసం ఎరువుల పంపిణీ ప్రక్రియకు ఈ యాప్‌ అమలు చేయనున్నామని అధికారులు చెబుతున్నారు. కాగా, రైతు సంఘాలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నాయి. రైతులకు పరిమిత సంఖ్యలో కాకుండా పూర్తిస్థాయిలో ఎరువులు అందజేయాలని కోరుతున్నాయి. ఈ విషయమై టెక్కలి మండల వ్యవసాయాధికారి ఎన్‌.శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా ఈ నెల 8 నుంచి ఏపీఏఐఎంఎస్‌ విధానం అమల్లోకి వచ్చిందన్నారు. ఈ విధానంలో రైతుసేవా కేంద్రాలు, ఎరువుల డీలర్ల వద్ద విక్రయాలు జరుగుతాయని తెలిపారు.

Updated Date - Jun 10 , 2026 | 12:17 AM