Share News

సాంకేతికతతోనే కేసుల దర్యాప్తు వేగవంతం

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:19 AM

కేసుల దర్యాప్తులో పారదర్శకత.. వేగం పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.

సాంకేతికతతోనే కేసుల దర్యాప్తు వేగవంతం
మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): కేసుల దర్యాప్తులో పారదర్శకత.. వేగం పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్‌ పోలీసింగ్‌ విధానంలో భాగంగా అందుబాటులో ఉన్న సాంకేతిక అప్లికేషన్లపై ప్రతి అధికారి పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. సాంకేతికత వినియోగంలో పట్టుసాధించాలని స్పష్టం చేశారు. ‘నాట్‌ గ్రిడ్‌ ద్వారా డేటా విశ్లేషణ, సీసీటీఎన్‌ఎస్‌లో ఎఫ్‌ఐఆర్‌ నుంచి చార్జ్‌షీట్‌ వరకు సమాచారాన్ని సకాలంలో నమోదు చేయాలి. క్రైమ్‌ మాక్‌ యాప్‌ ద్వారా అంతర్‌ జిల్లా, అంతర్‌ రాష్ట్ర నేరగాళ్లను గుర్తించాలి. ఈ-సాక్ష్య ద్వారా డిజిటల్‌ ఆధారాలను భద్రపరచడాన్ని తప్పనిసరి చేయాలి. ఈ-సమన్స్‌ విధానంలో ఎస్‌ఎంఎస్‌, ఈ-మెయిల్‌ ద్వారా సమన్లు పంపి సమయంతోపాటు ఖర్చును ఆదా చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే డయల్‌ 112 కాల్స్‌కు తక్షణమే స్పందించాలి. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయి. జిల్లాలోని మారుమూల, నిర్మానుష్య ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేయాలి’ అని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు కేవీ రమణ, పి.శ్రీనివాసరావు, డీఎస్పీలు షేక్‌ షాహాబాజ్‌ అహ్మద్‌, సీహెచ్‌ వివేకానంద, సీఐలు, ఎస్‌ఐలు, ఐటీ కోర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 12:19 AM