Share News

పల్లెలకూ సాంకేతిక పరిజ్ఞానం

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:06 AM

We will build 18 lakh houses for the poor రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి సాంకేతిక పరిజ్ఞానంతోపాటు మెరుగైన కమ్యూనికేషన్‌ సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం ఆరువేల సెల్‌టవర్లు ఏర్పాటు చేయనుందని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

పల్లెలకూ సాంకేతిక పరిజ్ఞానం
వృద్ధురాలికి పింఛన్‌ పంపిణీ చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో ఆరువేల సెల్‌టవర్ల ఏర్పాటు

పేదలకు 18 లక్షల ఇళ్లు నిర్మిస్తాం

మంత్రి కె.అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి సాంకేతిక పరిజ్ఞానంతోపాటు మెరుగైన కమ్యూనికేషన్‌ సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం ఆరువేల సెల్‌టవర్లు ఏర్పాటు చేయనుందని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం కోటబొమ్మాళి మండలంలోని పట్టుపురం, మణినాగేశ్వరపురం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పట్టుపురంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను అందజేశారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తాం. సుమారు 18 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతాం. వైసీపీ హయాంలో నిలిపేసిన లబ్ధిదారులకు సైతం ఇళ్ల బిల్లులు త్వరలో చెల్లిస్తాం. రూ.4.40 కోట్ల వ్యయంతో కొండపేట ఎత్తిపోతల పథకం మరమ్మతులు చేపట్టి ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం. రూ.5కోట్లతో మదనగోపాలసాగరం పనులు చేపడతాం. మరో ఆరునెలల్లో టెక్కలి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ ట్యాంకులు నిర్మించి ఇంటింటికీ సురక్షిత నీటిని అందిస్తాం. ఎక్కడా మట్టిరోడ్డు లేకుండా అభివృద్ధి చేస్తామ’ని తెలిపారు. కార్యకర్తలంతా ఐక్యమత్యంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్‌ చైర్మన్‌ బోయిన గోవిందరాజులు, పీఏసీఎస్‌ అధ్యక్షురాలు వెలమల విజయలక్ష్మి, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, టీడీపీ నాయకులు కామేశ్వరరావు, చిట్టి సింహాచలం, డీఆర్డీఏ పీడీ ఎన్‌.కిరణ్‌కుమార్‌, డ్వామా పీడీ లవరాజు, టెక్కలి ఆర్డీవో ఎన్‌.కృష్ణమూర్తి, తహసీల్దార్‌ అప్పలరాజు, ఎంపీడీవో ఫణీంద్రకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2026 | 12:06 AM