Share News

ఎన్నికల విధులతోఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:36 AM

వరుస ఎన్నికల విధులతో ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

ఎన్నికల విధులతోఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి
జిల్లా పంచాయతీ అధికారి స్వరూపరాణికి వినతిపత్రం అందిస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

- కంచిలి, కవిటిలో పనిచేసేవారికి పొందూరులో డ్యూటీ

- మెళియాపుట్టిలో ఉన్నవారికి జి.సిగడాంలో విధుల కేటాయింపు

- గుర్రుమంటున్న గురువులు

- కంచిలి మండలంలో ఎస్జీటీ టీచర్లగా పని చేస్తున్న బొంగు గురువునాయుడు, పెద్ద నిర్మలకు రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్‌కు సంబంధించి పొందూరు మండలంలో అధికారులు విధులు కేటాయించారు. ఈ మేరకు గురువారం జరిగే శిక్షణకు హాజరుకావాలని వారికి ఆర్డర్లు వచ్చాయి.

- మెళియపుట్టి మండలంలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎన్‌.ఈశ్వర్‌కు మొదటి విడత పంచాయతీ పోరు కోసం జి. సిగడాం మండలంలో డ్యూటీ వేశారు.

- కవిటి మండలంలో వివిధ పాఠశాలలో పనిచేస్తున్న 98 మంది ఉపాధ్యాయులకు, కంచిలి మండలంలో పనిచేస్తున్న 78 మంది టీచర్లకు పొందూరు మండలంలో ఎన్నికల విధులు కేటాయిస్తూ ఆర్డర్లు వచ్చాయి. పాతపట్నంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బూర్జ, ఎచ్చెర్ల మండలాల్లో డ్యూటీలు వేశారు.

- శ్రీకాకుళం, ఆమదాలవలస పట్టణానికి చెందిన కొందరు ఉపాధ్యాయులకు కూడా రెండో విడత పంచాయతీ ఎన్నికలకు డ్యూటీలు వేశారు. గురువారం జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని ఆర్డర్లు ఇచ్చారు. ఇదేరోజు శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆమదాలవలస మునిసిపాలిటీకి ఎన్నికలు జరగనుండడంతో ఓటుహక్కు ఎలా వినియోగించుకోవాలని వారు తలలు పట్టుకుంటున్నారు.

శ్రీకాకుళంఎడ్యుకేషన్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): వరుస ఎన్నికల విధులతో ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒకవైపు శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆమదాలవలస మునిపాలిటీ ఎన్నికలు, మరోకవైపు మొదటి విడత పంచాయతీ పోలింగ్‌, ఇంకొకపక్క రెండో విడత పంచాయతీ పోలింగ్‌ కోసం స్టేజ్‌-2 అధికారులకు శిక్షణ, మరోక వైపు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం తదితర విధులు కేటాయించడంతో గగ్గోలు పెడుతున్నారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారు. ఒక మండలంలో పని చేసున్న ఉపాధ్యాయులను ఎక్కడో 90, 100 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న మరో మండలంలో డ్యూటీలు వేయడంపై ఆవేదన చెందుతున్నారు. గురువారం జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు ఈ నెల 28,29 తేదీల్లో జరిగే రెండో విడతకు, డిసెంబరు 1,2 తేదీల్లో నిర్వహించే మూడో విడత పోలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. మధ్యాహ్నం వరకు పోలింగ్‌, తర్వాత కౌంటింగ్‌ చేపడతారు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డుమెంబర్లతో ప్రమాణం చేయించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగుతుంది. గొడవలు జరిగినా.. వివాదాలు రేగినా ఆ రాత్రంతా అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఇంటికి వచ్చినా మరుసటి రోజు మళ్లీ మరో మండలానికి విధులకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా వరుస డ్యూటీలతో టీచర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోక వైపు డ్యూటీల వద్ద భోజనాలు సక్రమంగా లేకపోవడంతో చేతిచమురు వదుల్చుకోవవాల్సి వస్తుందని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

డీపీవోను కలిసిన యూటీఎఫ్‌ నాయకులు

యూటీఎఫ్‌ జిల్లా సహా అధ్యక్షుడు వై.ఉమాశంకర్‌ ఆధ్వర్యంలో సంఘ నాయుకులు జిల్లా పంచాయతీ అధికారి స్వరూపరాణిని బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయు లకు ఎన్నికల విధులను ఇష్టారాజ్యంగా వేశారని, ఒకరోజు కూడా గ్యాప్‌ ఇవ్వకుండా వరుస డ్యూటీలు వేస్తే ఎలా వెళ్తారని ప్రశ్నించారు. కనీసం మూడో విడతలోనైనా మహిళ ఉపాధ్యాయులకు దగ్గర మండలాలను కేటాయించాలని కోరారు.

Updated Date - Nov 26 , 2026 | 12:36 AM