Share News

విద్యార్థినులకు అధ్యాపకుల వేధింపులు

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:18 AM

పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఒక రెగ్యులర్‌ అధ్యాపకుడితో పాటు ఒప్పంద అధ్యాపకుడు తమను మానసికంగా వేధిస్తున్నారంటూ ఆ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థినులు ఇటీవల కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నారాయణ భరత్‌ గుప్తాకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు.

విద్యార్థినులకు అధ్యాపకుల వేధింపులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విచారణ నిర్వహిస్తున్న ఆర్‌జేడీ

- ఆన్‌లైన్‌లో ఉన్నతాధికారికి ఫిర్యాదు

- విచారణ చేపట్టిన ఆర్‌జేడీ

ఆమదాలవలస, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఒక రెగ్యులర్‌ అధ్యాపకుడితో పాటు ఒప్పంద అధ్యాపకుడు తమను మానసికంగా వేధిస్తున్నారంటూ ఆ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థినులు ఇటీవల కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నారాయణ భరత్‌ గుప్తాకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు బుధవారం జోన్‌-1, 2 ఆర్‌జేడీ పీవీ కృష్ణాజీ ఆమదాలవలసలోని కళాశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. విద్యార్థినులకు 16 ప్రశ్నలతో కూడిన పత్రం ఇచ్చి వారి నుంచి లిఖితపూర్వక వివరణలు సేకరించారు. అదే విధంగా కళాశాల ప్రిన్సిపాల్‌, ఇతర అధ్యాపకులను కూడా పలు అంశాలపై ప్రశ్నించి వారినుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్నారు. ఈ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. దీనిపై ఆర్‌జేడీని విలేకరులు వివరణ కోరగా.. తాను కమిషనర్‌ ఆదేశాల మేరకు విచారణ చేపట్టానని, పూర్తి నివేదికను కమిషనర్‌కు సమర్పించిన తర్వాత చర్యలు తీసుకుంటారని అన్నారు. కాగా, విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన గురువులు ఇలాంటి చర్యలకు పాల్పడడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ ఇద్దరు అధ్యాపకులు తరగతి గదుల్లో అనుచిత ప్రవర్తనతో విద్యార్థినులను భయాందోళనకు గురిచేస్తున్నారని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడం గమనార్హం. వారిని చట్ట ప్రకారం శిక్షించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విచారణలో కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌ఎస్‌ఎన్‌ స్వామి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 12:18 AM