ఉపాధ్యాయుల సర్దుబాటు
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:05 AM
Seniority lists of surplus teachers today ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్, మునిసిపల్ యాజమాన్య పాఠశాలల్లో మిగులుగా తేలిన ఉపాధ్యాయులను అవసరం ఉన్న బడులకు సర్దుబాటు చేసేందుకు విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా షెడ్యూల్ విడుదల చేశారు.
నేడు మిగులు టీచర్ల సీనియారిటీ జాబితాలు
రేపు మండలస్థాయిలో కౌన్సెలింగ్
విద్యాశాఖ షెడ్యూల్ విడుదల
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్, మునిసిపల్ యాజమాన్య పాఠశాలల్లో మిగులుగా తేలిన ఉపాధ్యాయులను అవసరం ఉన్న బడులకు సర్దుబాటు చేసేందుకు విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 20వ తేదీ నాటికి నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా మిగులు టీచర్లను గుర్తించే పనిలో డిప్యూటీ డీఈవో, ఎంఈవోలు నిమగ్నమయ్యారు. గతేడాది ఉపాధ్యాయుల పునర్విభజనకు జారీ చేసిన ఉత్తర్వులను స్వల్పంగా సవరించారు. తాజాగా ఎంతమంది టీచర్లు అవసరమో సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల్లో మిగులు టీచర్లను, విద్యార్థులు పెరిగిన పాఠశాలలకు ఎంతమందిని పంపాలనే లెక్కను తేల్చే బాధ్యతను పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయంలోని ఐటీ విభాగానికి అప్పగించారు. అక్కడ గుర్తించిన వివరాలను డిప్యూటీ డీఈవో, ఎంఈవోలు ధ్రువీకరంచనున్నారు.
పాఠశాలల్లో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పని చేస్తున్న టీచర్లు, మిగులుగా ఉన్న వారి వివరాలను ఎంఈవోల లాగిన్‌కు బుధవారం పంపారు. ఎంఈవోలు వాటిని పరిశీలించి తేడాలు ఉంటే సవరించి డీఈవోలకు పంపాలి. డీఈవో ఆ వివరాలను పునఃపరిశీలించి ధ్రువీకరంచి డైరెక్టర్ కార్యాలయం ఐటీ విభాగానికి పంపాల్సి ఉంది. ఈ పక్రియ ప్రస్తుతం మందకొడిగా సాగుతోంది.
పాఠశాల యాజమాన్యం, క్యాడర్ సబ్జెక్టు వారీగా సీనియారిటీ జాబితాలను శుక్రవారం డైరెక్టర్ కార్యాలయ ఐటీ విభాగం తయారుచేసి ఎంఈవో లాగిన్‌కు పంపుతుంది. జాబితాల్లో మార్పులు, చేర్పులు అవసరమైతే డీఈవో టీస్ డేటా ఆధారంగా మార్పులకు అవకాశం ఇచ్చారు. శుక్రవారం ఎంఈవోలు మండలాల్లో మిగులు టీచర్ల సీనియారిటీ జాబితాలను డౌన్‌లోడ్ చేసి నోటీసు బోర్డుల్లో ఉంచాలి. వాటిపై ఏమైనా అభ్యంతరాలు వస్తే వాటిని సరిచేసి మళ్లీ డీఈవోకు జాబితా పంపించాలి. జాబితాలను సరిచేసిన తరువాత మండలస్థాయిలో మిగులు టీచర్లను తమ కార్యాలయానికి పిలిచి సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి వారు కోరుకున్న స్థానాలను కేటాయించాలి. మండల స్థాయిలో పూర్తయ్యాక ఆ వివరాలను డీఈవోకు అందజేయాలి. ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో స్థానాలు కోరుకున్న వారికి లీప్ యాప్ ద్వారా నియామకపత్రాలు జారీ చేస్తారు.
మండలాల్లో మిగిలిపోయిన టీచర్లను.. డివిజనల్ స్థాయిలో సీనియారిటీ జాబితాలు తయారు చేసి 28న విద్యాశాఖ అధికారులు సర్దుబాటు చేస్తారు. 29న డివిజనల్ స్థాయిలో మిగిలిన టీచర్లను జిల్లాస్థాయిలో కౌన్సెలింగ్ నిర్వహించి మిగిలిన ఖాళీలను కేటాయిస్తారు. 30న మండల, డివిజన్, జిల్లాస్థాయిలో పని సర్దుబాటు చేసినవారికి లీప్ యాప్ ద్వారా నియామక పత్రాలు జారీ చేస్తారు.
ఈ విషయంపై డీఈవో రవిబాబు వద్ద ప్రస్తావించగా ‘మండలస్థాయిలో మిగులు ఉపాధ్యాయులను గుర్తించి రాష్ట్ర ఐటీసెల్‌కు పంపించాం. అక్కడ నుండి ఆదేశాలు రాగానే మండలస్థాయిలో సర్దుబాటు ప్రక్రియ నిర్వహిస్తాం. ఇది తాత్కాలిక పని సర్దుబాటు మాత్రమే. కొందరికి మినహాయింపులు కూడా ఇచ్చామ’ని తెలిపారు.