Share News

టీడీపీ నాయకుడు తాతారావు ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి

ABN , Publish Date - May 03 , 2026 | 12:09 AM

టీడీపీ సీనియర్‌ నాయ కుడు, బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌, ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రధాన అనుచరుడు దాసరి తాతారావు ఇంటిపై శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.

టీడీపీ నాయకుడు తాతారావు ఇంటిపై   గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి
ఇంటి గేటు వద్ద ఉన్న రాళ్లు

  • మందస మండలం గొల్లలపాలెంలో ఘటన

హరిపురం, మే 2(ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్‌ నాయ కుడు, బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌, ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రధాన అనుచరుడు దాసరి తాతారావు ఇంటిపై శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దాసరి తాతారావు శనివారం నాలుగు గంటల సమయంలో ఇంటిలో ఉండగా ఒక్కసారిగా రాళ్లు దాడి జరిగింది. దీంతో ఉలిక్కిపడి బయటకు వచ్చి చూసేసరికి కారులో వచ్చిన దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. గ్రామస్థులు అక్కడికి చేరుకొనే సమయానికి కారుతో లోహరిబంద వైపు వెళ్లిపోయారు. దీంతో తాతారావు భార్య మాజీ ఎంపీపీ దాసరి జయలక్ష్మి పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ తన సిబ్బందితో గ్రామానికి చేరుకుని పరిశీలించారు. కాగా ఈ దాడి వెనుక కంకర మాఫియా హస్తం ఉండొచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత పదిరోజులుగా యశోదనగర్‌లో సోంపేట మండలానికి చెందిన ఓ వ్యక్తి యంత్రంతో కంకర తవ్వకాలు చేస్తుండగా.. స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అధికార పార్టీ నాయకుల అండతో ఎలాంటి అపరాధ రుసుం చెల్లించకుండానే తన యంత్రాన్ని విడిపించుకుపోయాడు. దీంతో అప్పటినుంచి కంకర మాఫియా నుంచి హెచ్చరికలు వస్తుండగా.. శనివారం రాళ్లదాడి జరిగింది. దీంతో వారిపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కంకర, మట్టి మాఫీయాపై కఠిన చర్యలు తీసుకుంటే గాని లేదంటే ఇలాంటి దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 03 , 2026 | 12:09 AM