త్వరలో ఎచ్చెర్లకు టీడీపీ ఇన్‌చార్జి?
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:41 PM
District In-charge Minister meets party cadre సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జి లేరు. అంతకుముందు ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు.. ఎన్నికల్లో సర్దుబాటు ప్రక్రియలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లికి వెళ్లారు. అక్కడ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై గెలిచి సంచలనం సృష్టించారు. ఆయన తర్వాత ఎచ్చెర్ల ఇన్‌చార్జి ఎవరన్నది అధినాయకత్వం తేల్చలేదు.
పార్టీ క్యాడర్‌తో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సమావేశం
మండలాల వారీగా అభిప్రాయ సేకరణ
సమర్థుడైన నాయకుడిని నియమించాలని విన్నపం
రణస్థలం, జూలై 2(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జి లేరు. అంతకుముందు ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు.. ఎన్నికల్లో సర్దుబాటు ప్రక్రియలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లికి వెళ్లారు. అక్కడ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై గెలిచి సంచలనం సృష్టించారు. ఆయన తర్వాత ఎచ్చెర్ల ఇన్‌చార్జి ఎవరన్నది అధినాయకత్వం తేల్చలేదు. కొద్ది నెలలుగా ఇక్కడి పార్టీ క్యాడర్ ఇన్‌చార్జిని నియమించాలంటూ ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం రణస్థలంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్టీ పరిశీలకులు రాధాకృష్ణ, కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో కోర్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం అయింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ కోర్ కమిటీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్‌చార్జిపై ఎచ్చెర్ల, జి.సిగడాం, లావేరు, రణస్థలం మండలాల వారీగా నేతలను పిలిచి కోర్ కమిటీ అభిప్రాయాలను కోరింది. దీంతో ఇక్కడి నాయకులు గత రెండేళ్లుగా ఎదురైన పరిణామాలను, పార్టీ స్థితిగతులను కోర్ కమిటీకి తెలియజేశారు. బీజేపీకి ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు ఉన్నారని, జనసేనకు సైతం ఇన్‌చార్జి ఉన్నారని, టీడీపీకి మాత్రం ఇన్‌చార్జి లేరని కార్యకర్తలు ఏకరవు పెట్టినట్లు సమాచారం. గత రెండేళ్లుగా ఇన్‌చార్జి నియామకం చేపట్టాలంటూ కోరుతున్నామని, ఇప్పటికైనా అధినాయకత్వం సమర్థుడైన నాయకుడిని నియమించాలని కోరినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలంటే ఇన్‌చార్జి ఉండాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే టీడీపీ ఇన్‌చార్జి పదవిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కోర్ కమిటీ సమావేశం రెండు గంటల పాటు జరిగింది. క్యాడర్ అభిప్రాయాలు తీసుకునే సమయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బయటే ఉండిపోయారు.