టీడీపీ జిల్లా కార్యాలయం మేనేజర్ హత్య
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:15 AM
A minor altercation.. claimed one person life ఇద్దరు యువకుల మధ్య స్వల్ప తగాదా.. ఒకరి ప్రాణాలు బలిగొంది. ఈ ఘటనలో టీడీపీ జిల్లా కార్యాలయం మేనేజర్ హత్యకు గురికాగా.. అటు కుటుంబ సభ్యుల్లోనూ, ఇటు పార్టీ శ్రేణుల్లోనూ విషాదం నెలకొంది. శ్రీకాకుళంలోని మండలవీధిలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
ద్విచక్ర వాహనం నుంచి తోసేసిన యువకుడు
రోడ్డుపై పడి మోహన్‌కృష్ణ మృతి
పోలీసుల ఎదుట నిందితుడు లొంగుబాటు
విషాదంలో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు
శ్రీకాకుళం క్రైం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ఇద్దరు యువకుల మధ్య స్వల్ప తగాదా.. ఒకరి ప్రాణాలు బలిగొంది. ఈ ఘటనలో టీడీపీ జిల్లా కార్యాలయం మేనేజర్ హత్యకు గురికాగా.. అటు కుటుంబ సభ్యుల్లోనూ, ఇటు పార్టీ శ్రేణుల్లోనూ విషాదం నెలకొంది. శ్రీకాకుళంలోని మండలవీధిలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వన్‌టౌన్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరం మండలవీధికి చెందిన గొర్లె మోహన్‌కృష్ణ(26).. గురువారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. మోహన్‌కృష్ణ 80 అడుగుల రోడ్డులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గురువారం నరసన్నపేటలో ఓ కార్యక్రమానికి వెళ్లి.. రాత్రి 11.30గంటల సమయంలో ఇంటికి తిరిగొస్తుండగా.. శ్రీకాకుళంలో ప్రభుత్వ మహిళా కళాశాల సమీపంలో కొంత మంది యువకులు నిల్చొన్నారు. వారిలో మహాలక్ష్మినగర్ కాలనీకి చెందిన మనోహర్ అనే యువకుడు మోహన్‌కృష్ణను పిలిచాడు. ఈ రాత్రిపూట ఇక్కడ పని ఏంటని అడిగాడు. నా ఇష్టం.. నేను ఇక్కడ ఉంటే నీకు ఏమిటి ఇబ్బందని మనోహర్ ఎదురు ప్రశ్నించాడు. దీంతో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి తగాదాకు దారి తీసింది. ఈక్రమంలో మోహన్‌కృష్ణ.. మనోహర్ తల్లిని, కుటుంబ సభ్యులను దూషించారు. దీంతో కోపం తట్టుకోలేక మనోహర్ ఒక్కసారిగా ద్విచక్ర వాహనంపై ఉన్న మోహన్‌కృష్ణపై చేయిచేసుకొని తోసేశాడు. మోహన్‌కృష్ణ కింద పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు వెంటనే మోహన్‌కృష్ణను శ్రీకాకుళంలో రిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. తనవల్ల తప్పు జరిగిందని మనోహర్ గుర్తించి వెంటనే వన్‌టౌన్ పోలీసుల వద్ద లొంగిపోయాడు. శ్రీకాకుళం రూరల్ సీఐ పైడిపునాయుడు, వన్‌టౌన్ ఎస్‌ఐ హరికృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులు నుంచి వివరాలు తీసుకొని దర్యాప్తు చేపట్టారు.
తండ్రి మరణం తర్వాత..
మోహన్‌కృష్ణ తండ్రి గొర్లె వెంకటరమణ నందమూరి బాలకృష్ణ అభిమానిగా, టీడీపీ కార్యకర్తగా ఉండేవారు. సుమారు 20 ఏళ్లు జిల్లా టీడీపీ కార్యాలయంలో పనులు చేస్తూ ఎంతోమంది నాయకులు మన్ననలు పొందారు. 2024 మే 9న గొర్లె వెంకటరమణ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో బీటెక్ పూర్తిచేసిన కుమారుడు మోహన్‌కృష్ణకు జిల్లా టీడీపీ కార్యాలయ మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించారు. విధి నిర్వహణలో చురుగ్గా ఉండే మోహన్‌కృష్ణ.. ఊహించని విధంగా హత్యకు గురికావడంతో తల్లి లక్ష్మీ, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్.. ఆయన పాడె మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మోహన్‌కృష్ణ తల్లి లక్ష్మీ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.