Share News

ఆఖరి మజిలీలో అన్నీ తానై..

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:44 AM

తాళికట్టి... ఏడడుగులు నడిచిన భర్త అర్థాంతరంగా కన్నుమూస్తే...ఆ ఇల్లాలే అంత్యక్రియలు పూర్తి చేసిన ఘటన స్థానిక కాపువీధిలో సోమవారం చోటుచేసుకుంది.

 ఆఖరి మజిలీలో  అన్నీ తానై..
భర్త లక్ష్మీనారాయణకు అంత్యక్రియలు చేస్తున్న భార్య

  • భర్తకు అంత్యక్రియలు చేసిన భార్య

పలాస, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): తాళికట్టి... ఏడడుగులు నడిచిన భర్త అర్థాంతరంగా కన్నుమూస్తే...ఆ ఇల్లాలే అంత్యక్రియలు పూర్తి చేసిన ఘటన స్థానిక కాపువీధిలో సోమవారం చోటుచేసుకుంది. 23వ వార్డు కాపువీధిలో నివాసం ఉంటున్న బెహరా లక్ష్మీనారాయణ(44) అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించడానికి పిల్లలు చిన్నవారు కావడంతో భార్య పార్వతి భర్తకు తలకొరివి పెట్టింది. చిన్నచిన్న పనులు చేసుకుని జీవిస్తుండే ఆ ఇంటి పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు దిక్కెవరని కన్నీటిపర్యంతమవుతున్నారు. నిండునూరేళ్లు కలిసి జీవిస్తామని ప్రమాణం చేసిన భర్త మృతి చెందడంతో భార్య తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Updated Date - Aug 25 , 2026 | 12:44 AM