Share News

ముంపు ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టండి

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:37 AM

జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు.

ముంపు ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టండి
మామిడివలసలో నీట మునిగిన పంట పొలాలను డ్రోన్‌ కెమెరాతో పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్యా

-పారదర్శకంగా పంట నష్టం అంచనా

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

నరసన్నపేట, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. వరద ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నీటి ప్రవాహానికి ఏర్పడిన అడ్డంకులను డ్రోన్‌ కెమెరాల సాయంతో గుర్తించి వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఆదివారం నరసన్నపేట మండలంలోని చిక్కాలవలస, బసివలస, కుద్దిరాం, సుందరాపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. నీట మునిగిన పొలాలతో పాటు మామిడివలస నుంచి మూడు కిలోమీటర్లు రైల్వేట్రాక్‌ మీద నడిచి కంబకాయి తుంపర భూములను పరిశీలించారు. కాలువలు మూసుకుపోవడం, ప్రవాహంలో ఏర్పడిన లోపాలను డ్రోన్‌ కెమెరాల ద్వారా పరిశీలించి, కారణాలను అధికారులను అడిగితెలుసుకుని తగిన సూచనలు ఇచ్చారు. గుర్రపు డెక్క తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు, వరద వెంటనే తొలగించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు.

- వర్షాలు, వరద ఉధృతి తగ్గుముఖం పట్టిన వెంటనే క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సంయుక్తంగా ప్రతీ ఎకరాను సందర్శించి, నిజమైన బాధితులైన రైతుల్లో ఒక్కరు కూడా నష్టపోకుండా సమగ్ర జాబితాలను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అదే సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారులు, తెగిపోయిన కాలువలు, దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలు, ఇతర ప్రభుత్వ నిర్మాణాల తాత్కాలిక మరమ్మతులను తక్షణమే చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. శాశ్వత పునరుద్ధరణ పనులకు సంబంఽధించి, సమగ్ర నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బాధితులకు త్వరితగతిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండియా, తహసీల్దార్‌ ఆర్‌.సత్యనారాయణ, వంశధార ఈఈ మురళీమోహనరావు, డీఈఈ రామలక్ష్మి, శిమ్మ శ్రీను, వ్యవసాయశాఖ ఏవో సూర్యకుమారి, ఉద్యానవనశాఖ అధికారులు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ప్రతినిధి పాగోటి అప్పలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 12:37 AM