Share News

‘గుర్తు’ంచుకోండి!

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:34 AM

25 symbols for Sarpanch candidates స్థానిక సంస్థల్లో పంచాయతీ సర్పంచి ఎన్నిక కీలకమైనది. రాజకీయ పార్టీల గుర్తులతో ఎన్నికలు జరిగితే ఫర్వాలేదు. కానీ పార్టీ గుర్తులకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. అక్కడే అసలైన చిక్కు. గుర్తులను పోలిన గుర్తులు ఉండడంతో ఓటరు అయోమయానికి గురవుతాడు. అందుకే ఒక గుర్తుకు వేయాల్సిన ఓటు మరొకరికి వేస్తాడు. దీంతో పలితం తారుమారు అవుతుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో గుర్తుదే కీలకపాత్ర. అభ్యర్థులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఓటర్లకు అవగాహన కల్పించకపోయినా మూల్యం తప్పదు.

‘గుర్తు’ంచుకోండి!
సర్పంచ్‌ ఎన్నికలకు కేటాయించిన గుర్తులు

  • పంచాయతీ ఎన్నికల్లో గుర్తులే కీలకం

  • సర్పంచ్‌ అభ్యర్థులకు 25, వార్డు సభ్యులకు 20 గుర్తులు

  • ఓటర్లకు అవగాహన కల్పిస్తే మేలు

  • లేదంటే ఫలితాలు తారుమారయ్యే అవకాశం

  • రణస్థలం/ హిరమండలం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో పంచాయతీ సర్పంచి ఎన్నిక కీలకమైనది. రాజకీయ పార్టీల గుర్తులతో ఎన్నికలు జరిగితే ఫర్వాలేదు. కానీ పార్టీ గుర్తులకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. అక్కడే అసలైన చిక్కు. గుర్తులను పోలిన గుర్తులు ఉండడంతో ఓటరు అయోమయానికి గురవుతాడు. అందుకే ఒక గుర్తుకు వేయాల్సిన ఓటు మరొకరికి వేస్తాడు. దీంతో పలితం తారుమారు అవుతుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో గుర్తుదే కీలకపాత్ర. అభ్యర్థులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఓటర్లకు అవగాహన కల్పించకపోయినా మూల్యం తప్పదు.

  • జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 910 పంచాయతీలకు ఈ నెల 26, 29, వచ్చే నెల 2న మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలివిడత ఈ నెల 26న పలాస డివిజన్‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు. పార్టీలకతీతంగా జరిగే ఈ ఎన్నికలకుగానూ రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచులకు 25, వార్డు సభ్యులకు 20చొప్పున లోకల్‌ గుర్తులను కేటాయించింది.

  • సర్పంచు అభ్యర్థులకు గుర్తులివే: మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పూ సాసరు, క్యారెట్‌, కుర్చీ, బ్యాట్‌, తాళం చెవి, గొలుసు, టెలిఫోన్‌, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపళ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తి, నల్లబోర్డు, అనాసపండు, షటిల్‌, చేతికర్ర, చెంచా.

  • వార్డు సభ్యులకు : ప్రెషర్‌ కుక్కర్‌, గౌను, స్టూల్‌, ఇస్త్రీ పెట్టె, పోస్టుడబ్బా, గ్యాస్‌ స్టౌ, బీరువా, ఐస్‌క్రీం, కెటిల్‌, కటింగ్‌ ప్లేయర్‌, విద్యుత్‌ స్తంభం, గరాట, డిష్‌యాంటెన్నా, రంపం, కెమురా, క్యారమ్‌బోర్డు, వయోలిన్‌, బెండకాయ, బెల్టు, కోటు గుర్తులు కేటాయించారు.

  • బ్యాలెట్‌లో పేర్లు ఉండవు

  • పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌కు గులాబీ, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్లు వినియోగిస్తారు. బ్యాలెట్‌పై అభ్యర్థుల పేర్లకు బదులు.. క్రమసంఖ్య, గుర్తు మాత్రమే ఉంటాయి. నామినేషన్లు ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల పేర్లు ఆధారంగా తెలుగు అక్షరమాల క్రమంలో గుర్తులు ఇస్తారు.

  • సర్పంచ్‌ అభ్యర్థులు, వార్డు సభ్యులకు కేటాయించిన గుర్తుల్లో చాలావరకూ దగ్గర పోలికలు ఉంటాయి. ఓటువేసే వారు గ్రామీణ ప్రాంతాలవారు కావడంతో వారు తికమకపడుతుంటారు. అందుకే గుర్తుల విషయంలో అభ్యర్థులకు ఆందోళన తప్పేలా లేదు. అయితే ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయమే ఉంటుంది. దానిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటేనే మంచిది. గుర్తుల విషయంలో సర్పంచ్‌, వార్డులకు వేర్వేరుగా ఉంటుంది కాబట్టి ఓటర్లకు అవగాహన కల్పించడం కీలకమని పలువురు పేర్కొంటున్నారు.

  • రెండు రెట్లు పెరిగిన డిపాజిట్‌

  • 2021 ఎన్నికలతో పోల్చితే ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల డిపాజిట్‌ మొత్తాన్ని రెండు రెట్లు పెంచారు. గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు రూ.750, జనరల్‌ అభ్యర్థులు రూ.1500 చొప్పున చెల్లించారు. తాజాగా నిర్వహిస్తున్న ఎన్నికలకు రిజర్వేషన్‌ వర్తించే అభ్యర్థులు రూ.1500, జనరల్‌ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.3వేలు చొప్పున డిపాజిట్‌ చెల్లించాలి. వార్డు సభ్యులకు మాత్రం పాత డిపాజిట్‌నే కొనసాగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థి రూ.500, జనరల్‌ అయితే రూ.1000 చొప్పున చెల్లించాలి.

  • వ్యయంలో వెసులుబాటు..

  • అభ్యర్థులకు వ్యయపరిమితి పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లో 10వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు పోటీ చేసే సర్పంచి అభ్యర్థులు రూ.1.5 లక్షలు, వార్డు సభ్యులు రూ.30వేల లోపు ఖర్చు చేశారు. ప్రస్తుతం 10వేల లోపు జనాభా ఉన్న పంచాయతీకు రూ.2.5లక్షలు ఖర్చు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వార్డు సభ్యులు రూ.60వేలు దాటకుండా చూసుకోవాలి. 10వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీ అయితే సర్పంచి అభ్యర్థి రూ.4లక్షలు, వార్డు సభ్యులు రూ.లక్ష వరకు ఖర్చు చేయవచ్చు.

  • చిటికెన వేలికి సిరా గుర్తు

  • ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలిపై సిరా గుర్తు వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిది. ఈ నెల 5న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లు ఎడమచేతి చూపుడు వేలిపై, మరుసటి రోజు కొన్నిచోట్ల రీపోలింగ్‌లో మధ్య వేలిపై సిరా గుర్తు వేశారు. ఇవి ఇంకా తొలగలేదు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు, గందరగోళం తలెత్తకుండా ఎడమచేతి చిటికెన వేలిపై సిరా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

Updated Date - Nov 16 , 2026 | 12:34 AM