Share News

అప్పుడు సస్పెన్షన్‌.. ఇప్పుడు ట్రాన్స్‌ఫర్‌

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:14 AM

Kurmarao's Transfer బాధ్యతలు చేపట్టిన 11 రోజులకే సస్పెన్షన్‌! మళ్లీ విధుల్లో చేరిన మూడు నెలలకే ట్రాన్స్‌ఫర్‌! రాజకీయ వివాదాల నేపథ్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌ కూర్మారావు బదిలీ అయ్యారు. నూతన కమిషనర్‌గా కావలిలో విధులు నిర్వర్తిస్తున్న జి.శ్రవణ్‌ కుమార్‌ నియమితులయ్యారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అప్పుడు సస్పెన్షన్‌.. ఇప్పుడు ట్రాన్స్‌ఫర్‌
కూర్మారావు, కొత్త కమిషనర్‌ శ్రవణ్‌ కుమార్‌

రాజకీయ వివాదాలకు కూర్మారావు బదిలీ

మాతృశాఖకు పంపిన పురపాలకశాఖ

నూతన కమిషనర్‌గా శ్రవణ్‌ కుమార్‌

శ్రీకాకుళం, జూలై 3(ఆంధ్రజ్యోతి): బాధ్యతలు చేపట్టిన 11 రోజులకే సస్పెన్షన్‌! మళ్లీ విధుల్లో చేరిన మూడు నెలలకే ట్రాన్స్‌ఫర్‌! రాజకీయ వివాదాల నేపథ్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌ కూర్మారావు బదిలీ అయ్యారు. నూతన కమిషనర్‌గా కావలిలో విధులు నిర్వర్తిస్తున్న జి.శ్రవణ్‌ కుమార్‌ నియమితులయ్యారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

వ్యవసాయశాఖలో పనిచేస్తున్న కూర్మారావును శ్రీకాకుళం మున్సిపల్‌ కమిషర్‌గా నియమిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఫిబ్రవరి 6న ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 11న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే వారం రోజులకే నగరంలో డయేరియా ప్రబలింది. వందల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల పాలయ్యారు. దీనిపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. కూర్మారావును ఫిబ్రవరి 25న సస్పెండ్‌ చేసింది. అయితే అప్పట్లో కొందరు కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్లే డయేరియా ప్రబలిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. వారి కారణంగా కూర్మారావు బలయ్యారన్న ప్రచారం సాగింది. అయితే జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మళ్లీ ఈయన్ను శ్రీకాకుళం తెచ్చుకున్నారు. ప్రభుత్వం కూర్మారావుపై సస్పెన్షన్‌ ఎత్తివేసి రీపోస్టింగ్‌ ఇచ్చింది. దీంతో ఆయన మార్చి 26న కమిషనర్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టారు. ఆతర్వాత కార్పొరేషన్‌ను చక్కదిద్దేపనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈయన తీరుపట్ల శ్రీకాకకుళం నియోజకవర్గ నాయకులు గుర్రుగా ఉన్నారు. కూర్మారావు ఇక్కడి నుంచి తప్పించేందుకు పావులు కదపడం మొదలు పెట్టారు. ఈ విషయం గమనించి కమిషనర్‌ జూన్‌ మొదటి వారంలో దీర్ఘకాలిక సెలవులో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే కీలకప్రజానిధి, మరికొందరు నచ్చజెప్పడంతో ఆ ఆలోచన మానుకున్నట్లు తెలిసింది. ఆతర్వాత నియోజకవర్గ నాయకులు మళ్లీ ఆయనపై ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. అయితే కూర్మారావుపై ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కూర్మారావును శ్రీకాకుళం కమిషనర్‌ బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ హోదాలో ఉన్న ఆయనను.. ఆయన మాతృశాఖ వ్యవసాయ శాఖకు పంపింది. కావలి మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న జి.శ్రవణ్‌ కుమార్‌ను ఇక్కడికి బదిలీ చేసింది.

Updated Date - Jul 04 , 2026 | 12:14 AM