ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:28 AM
Vote counting is tomorrow ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో ఆదివారం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక ఫలితాలపై అభ్యర్థులు, నేతల్లో ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో అభ్యర్థులు లెక్కలు, కూడికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యారు.
రేపే ఓట్ల లెక్కింపు
కూడికలు, తీసివేతల్లో నేతల బిజీ
అభ్యర్థుల్లో క్రాస్‌ఓటింగ్ గుబులు
వైసీపీలోనే ఎక్కువగా భయం
ఇచ్ఛాపురం/ పలాస, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో ఆదివారం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక ఫలితాలపై అభ్యర్థులు, నేతల్లో ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో అభ్యర్థులు లెక్కలు, కూడికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యారు. ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో చాలావార్డుల్లో భారీగా క్రాస్‌ఓటింగ్ జరిగినట్టు ప్రచారం నడుస్తోంది. చైర్‌పర్సన్ అభ్యర్థిత్వాన్ని ఆశించినవారు చాలామంది భంగపడ్డారు. అటువంటి వారు కౌన్సిలర్లుగా పోటీ చేశారు. పట్టున్న ప్రాంతాల్లో తమకు కౌన్సిలర్లుగా ఓటువేసి.. చైర్‌పర్సన్ ఓట్లను ప్రత్యర్థులకు వేయాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీలో అటువంటి పరిస్థితి ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. నియోజకవర్గంలో వైసీపీ నాయకత్వ ప్రభావం మునిసిపాలిటీపై పడింది. ఇక్కడ చైర్‌పర్సన్ అభ్యర్థులుగా జిల్లా నాయకులు చాలామందికి హామీలు ఇచ్చేశారు. దీంతో వారంతా తామే అభ్యర్థులమని భావించారు. అదే సమయంలో చైర్‌పర్సన్ అభ్యర్థిగా బరిలో దిగిన పిలక రాజ్యలక్ష్మి.. నియోజకవర్గ వైసీపీ బాధ్యతలను ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా వేరే నేతకు అవకాశం కల్పించారు. మరోవైపు మొన్నటి ఎన్నికల్లో పోటీచేసిన జడ్పీ మాజీ చైర్‌పర్సన్ పిరియా విజయని బాధ్యతల నుంచి తప్పించడం కూడా మైనస్‌గా మారింది. పైగా వార్డు సభ్యులగా పోటీ చేసిన వారికి తగినంత ప్రోత్సాహం లేకపోవడం ఇబ్బందిగా మారింది. అందుకే పార్టీలో మూడు కేంద్రాలుగా మారడంతో.. ఎవరి మద్దతుదారులు వారికే టిక్కెట్లు ఇప్పించుకోగలిగారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున క్రాస్‌ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. వైసీపీ మాదిరిగానే టీడీపీలో పోటీచేసేందుకు చాలామంది ఆశావహులు ముందుకు వచ్చారు. కానీ టీడీపీ హైకమాండ్ ఏకపక్షంగా మాత్రం టిక్కెట్ ఇవ్వలేదు. ఐవీఆర్‌ఎస్ సర్వే ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించి చివరకు ఆశి లీలారాణి పేరు ప్రకటించింది. దీంతో మిగతా ఆశావహులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే క్రాస్‌ఓటింగ్ జరగకుండా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్‌బాబు చొరవ తీసుకున్నారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రత్యేక దృష్టిపెట్టారు. దీంతో చాలావరకూ అసంతృప్తులు సమసిపోయాయి. నేతల మధ్య ఐక్యత కనిపించింది. అయితే తుది ఫలితం ఎలా రాబోతుందో వేచిచూడాలి. అలాగే పలాస-కాశీబుగ్గ.. టీడీపీకి తొలినుంచి కంచుకోట. చైర్‌పర్సన్‌తోపాటు వార్డులవారీ అభ్యర్థుల ఎంపిక విషయంలో గందరగోళం లేకుండా ప్రణాళికతో సాగింది. దీంతో పట్టణ ఓటర్లు.. ఎన్నికల్లో టీడీపీవైపు మొగ్గు చూపారన్న ప్రచారం సాగుతోంది.