Share News

పాత నేరస్తులపై నిఘా

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:48 PM

పాత నేరస్తులపై నిఘా పెట్టడంతో పాటు వారికి కౌన్సెలింగ్‌ తప్పనిసరిగా ఇవ్వాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.

పాత నేరస్తులపై నిఘా
మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

- ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పాత నేరస్తులపై నిఘా పెట్టడంతో పాటు వారికి కౌన్సెలింగ్‌ తప్పనిసరిగా ఇవ్వాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం నెలవారీ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, కోర్టు వ్యవహారాలు, నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్ల అమలు, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ‘హిస్టరీ షీటర్ల కదిలికలపై నిఘా కొనసాగించాలి. ప్రజల వినతులను చట్టపరంగా, సమయపాలనతో పరిష్కరించాలి. దీర్ఘకాల పెండింగ్‌ కేసులను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలి. స్మార్ట్‌ పోలీసింగ్‌, నూతన క్రిమినల్‌ చట్టాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. ప్రతి అధికారీ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్ల అమలు, చార్జ్‌షీట్లు దాఖలు తదితర కోర్టు సంబంధిత అంశాల్లో సమయపాలనతో వ్యవహరించాలి. విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు, కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్లు బలోపేతం చేయాలి. రాత్రి గస్తీ, బీట్‌లో అప్రమత్తంగా ఉండాలి. డయల్‌ 112 కాల్స్‌కు తక్షణం స్పందించాలి. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి అధికారీ బాధ్యతాయుతంగా పని చేయాలి.’అని ఎస్పీ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు కేవీ రమణ, పి.శ్రీనివాసరావు, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, ఎస్‌బీ సీఐ ఇమాన్యూవల్‌రాజు, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాస్‌, ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 11:48 PM