Share News

మిగులు బడ్జెట్‌ రూ.71.65కోట్లు

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:17 AM

ZP budget approved జిల్లా సమగ్రాభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా జిల్లా ప్రజాపరిషత్‌ (జడ్పీ) రూపొందించిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.

మిగులు బడ్జెట్‌ రూ.71.65కోట్లు
అధికారుల తీరును నిలదీస్తున్న పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌, ఇన్‌సెట్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ

  • రూ. 1,743.36 కోట్లతో జడ్పీ బడ్జెట్‌కు ఆమోదం

  • గ్రామీణ తాగునీరు, మహిళా, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ప్రాధాన్యం

  • శ్రీకాకుళం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): జిల్లా సమగ్రాభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా జిల్లా ప్రజాపరిషత్‌ (జడ్పీ) రూపొందించిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. మంగళవారం జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ అంచనాలను, 2025-26 సవరణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయం రూ.1,743.36 కోట్లుగా అంచనా వేయగా.. వ్యయం రూ.1,671 కోట్లు చూపించారు. దీంతో రాబోయే ఏడాదికి రూ.71.65కోట్ల మిగులు బడ్జెట్‌ను సభ ముందుంచారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26) సవరణ బడ్జెట్‌ను రూ.1,718.85 కోట్ల ఆదాయం, రూ.1,648 కోట్ల వ్యయంతో, రూ. 70.18 కోట్ల ముగింపు నిల్వ ఉండేలా రూపొందించారు.

  • కేటాయింపుల వివరాలు..

  • జడ్పీ సాధారణ నిధుల నుంచి ఆయా వర్గాల సంక్షేమానికి కేటాయించారు. తాగునీటి సరఫరాకు(12శాతం) రూ.88.26 లక్షలు, ఎస్సీ సంక్షేమానికి (15శాతం) రూ.1.10 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి (6 శాతం) రూ.44.13 లక్షలు, మహిళా శిశు సంక్షేమానికి (15 శాతం) రూ.1.10 కోట్లు కేటాయించారు. జడ్పీ పరిధిలో అభివృద్ధి పనుల కోసం రూ.1.69 కోట్లు కేటాయించారు. 16వ ఆర్థిక సంఘం నిధులు... కేంద్ర గ్రాంట్ల ద్వారా వచ్చే ఏడాదికి రూ.24.75 కోట్లు అందుతాయని అంచనా వేశారు. ఈ నిధులను సీపీడబ్ల్యూఎస్‌ స్కీముల నిర్వహణకు వినియోగించనున్నారు.

  • సొంత ఆదాయ వనరులు..

  • సీనరేజ్‌ ఫీజు ద్వారా రూ.6.21 కోట్లు, స్టాంప్‌ డ్యూటీ సర్‌చార్జి ద్వారా రూ.57.10 లక్షలు, తలసరి గ్రాంటు ద్వారా రూ.1.08కోట్లు జడ్పీకి సొంత ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. సమావేశంలో పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జడ్పీ సీఈవో సత్యనారాయణతోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

  • సమగ్ర వివరాలు ఏవీ?: పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ ఆగ్రహం

  • జడ్పీ బడ్జెట్‌ నివేదికలో సమగ్ర వివరాలు లేవంటూ.. కొంతమంది జిల్లా అధికారుల తీరును పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తూర్పారా బట్టేశారు. ప్రతి ఆరు నెలలకు సంబంధించి మైన్స్‌ శాఖ నుంచి జిల్లా పరిషత్‌కు సమర్పించాల్సిన ‘రికన్సలేషన్‌’..ఎక్కడున్నాయని ప్రశ్నించగా అధికారుల నుంచి సరైన జవాబు లభించలేదు. ఈ విషయమై పీయూసీ చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేసి.. వివరాలతో అధికారులు సమావేశానికి రాకపోతే ఎలా అని నిలదీశారు. జడ్పీ చైర్‌పర్సన్‌కు రూ. లక్షల్లో అద్దెలు చెల్లించడమేంటని ప్రశ్నించారు. అయితే... సొంత వాహనాన్ని సమకూర్చుకున్నారని, డ్రైవర్‌ వేతనంతోపాటు బిల్లు చెల్లిస్తున్నామని అధికారులు వివరించారు. సచివాలయాలలో ఇళ్ల నిర్మాణాల జాబితా ఎందుకు పెట్టడం లేదని జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ సభలో అనడంతో.. ఈవిషయమై పీయూసీ చైర్మన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. సచివాలయాలు సరిగ్గా పనిచేయడంలేదని వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 28 , 2026 | 12:17 AM