ఇంటి పెద్ద ఆత్మ వెంటాడుతోందని..
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:33 AM
Suicide of three womens అంతుచిక్కని అనారోగ్యం.. వెంటాడిన ‘ఆత్మ’ భయం.. వెరసి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళల ఆత్మహత్యకు దారితీసింది. కుటుంబ పెద్ద మరణం తర్వాత వచ్చిన మానసిక కుంగుబాటు, అనారోగ్య సమస్యలను దెయ్యం పీడగా భ్రమించారు. మంత్రగాళ్ల వద్దకు వెళ్లారు. పూజలు చేయించుకున్నారు. అయినా బాగుకాలేదని వారిలో తీవ్రమైన మనోవేదన. చివరకు ఓ తల్లి, ఇద్దరు కుమార్తెలు గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
మూఢనమ్మకాలకు మూడు ప్రాణాలు బలి
గడ్డిమందు తాగిన తల్లి, ఇద్దరు కుమార్తెలు
మంత్రగాళ్ల వద్దకు వెళ్లినా బాగు కాలేదని..
అక్కడే ఒకరు.. ఆసుపత్రిలో ఇద్దరి మృతి
శాస్త్రసాంకేతిక రంగాల్లో దూసుకుని పోతున్న కాలంలోనూ.. మూఢనమ్మకాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అనారోగ్యానికి వైద్యం చేయించుకోవాల్సిందిపోయి.. మంత్రగాళ్లతో పూజలు చేయించుకుంటున్నారు. చివరకు మానసిక ఆందోళనతో ప్రాణాలనే తీసుకుంటున్నారు.
అంతుచిక్కని అనారోగ్యం.. వెంటాడిన ‘ఆత్మ’ భయం.. వెరసి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళల ఆత్మహత్యకు దారితీసింది. కుటుంబ పెద్ద మరణం తర్వాత వచ్చిన మానసిక కుంగుబాటు, అనారోగ్య సమస్యలను దెయ్యం పీడగా భ్రమించారు. మంత్రగాళ్ల వద్దకు వెళ్లారు. పూజలు చేయించుకున్నారు. అయినా బాగుకాలేదని వారిలో తీవ్రమైన మనోవేదన. చివరకు ఓ తల్లి, ఇద్దరు కుమార్తెలు గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. జలుమూరు మండలం మర్రివలసలో జరిగిన ఈ విషాద ఘటన కలవరం రేపింది.
జలుమూరు, జూలై 10(ఆంధ్రజ్యోతి): జలుమూరు మండలం మర్రివలసలో శుక్రవారం తల్లీ, కుమార్తెల ఆత్మహత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన ముద్ద అప్పయ్య, దాలెప్పమ్మ(65) దంపతులకు నలుగురు కుమార్తెలు. అందులో ముగ్గురికి వివాహాలు అయ్యాయి. చిన్న కుమార్తె సరస్వతి(35) దివ్యాంగురాలు. ఈమె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అలాగే పెద్ద కుమార్తె దాలమ్మ(45)ను భర్త విడిచిపెట్టడంతో కన్నవారింటిలోనే ఉంటోంది. కాగా.. అప్పయ్య ఐదు నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో దాలెప్పమ్మ.. తన ఇద్దరి కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తోంది. తరచూ ఆ ముగ్గురూ అనారోగ్యానికి గురవుతూ.. మానసికంగా బాధపడుతున్నారు. అప్పయ్య చనిపోయిన తర్వాత.. దెయ్యంగా మారి.. తమను పీడిస్తున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలతో దాసురాలు వద్దకు వెళ్లినా ఆరోగ్యం కుదుటపడలేదు. మరోవైపు ఇద్దరి కుమార్తెలతో జీవనం సాగించడం కష్టమని.. ఇక చావే శరణ్యమని భావించారు. ఈక్రమంలో తల్లీ కుమార్తెలిద్దరూ శుక్రవారం ఉదయం గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొద్దిసేపటి తర్వాత అపస్మారకస్థితికి చేరుకోగా స్థానికులు గమనించారు. 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరిశీలించగా.. అప్పటికే దాలెప్పమ్మ మృతి చెందిందని నిర్ధారించారు. మిగిలిన ఇద్దరు కుమార్తెలను బుడితిలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో.. అక్కడి నుంచి శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్)కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్న కుమార్తె సరస్వతి శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. కొద్దిసేపటి తర్వాత పెద్ద కుమార్తె దాలమ్మ కూడా ప్రాణాలు కోల్పోయింది. తల్లీ కుమార్తెలిద్దరూ మృతి చెందడంతో గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.
సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ బి.అశోక్‌బాబు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం దాలెప్పమ్మ మృతదేహాన్ని నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీఆర్వో దూసి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.