Share News

చేదెక్కిన చక్కెర.. ఘాటెక్కిన ఉల్లి

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:05 AM

Rising prices of essential commodities అసలే శ్రావణమాసం.. వరుసగా పండుగల సీజన్‌ వస్తోంది. పిండి వంటలు చేయాలి. కానీ మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు చూస్తుంటే.. సామాన్యులు ఏం కొనలేం అన్నట్టు ఉంది పరిస్థితి.

చేదెక్కిన చక్కెర.. ఘాటెక్కిన ఉల్లి

  • పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు

  • అదేబాటలో సన్నబియ్యం

  • ఎల్‌నినో ప్రభావంతో ధరల భారం

  • సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో ఆందోళన

  • రణస్థలం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి):

  • నెలరోజుల కిందట కిలో పంచదార ధర రూ.49 ఉండేది. ఇప్పుడు రూ.75కు చేరుకుంది. బ్రాండెడ్‌ సంస్థలైతే కిలో రూ.80 చొప్పున విక్రయిస్తున్నాయి. కిలో బెల్లం రూ.80 నుంచి రూ.90 వరకూ పెరిగింది. బెల్లం, పంచదారతో తయారుచేసే ప్రతి వస్తువుల ధరలు ఇప్పుడు మార్కెట్‌లో పెరిగాయి. ఆ భారం ప్రజలపై పడుతోంది.

  • రెండు నెలల కిందట కిలో ఉల్లి ధర రూ.20 ఉండేది. గత నెల రూ.37కి చేరగా.. ప్రస్తుతం రూ.55కు పెరిగింది. అదే నాణ్యమైన ఉల్లి దొరకాలంటే రూ.60 చెల్లించాల్సిందే. మున్ముందు ఉల్లి ధర మరింత పెరగవచ్చు అని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లలో నిర్వాహకులు ఉల్లితో తయారైన వంటకాలపై ధరలు పెంచేసి.. ఆ భారం వినియోగదారులపై మోపుతున్నారు.

  • మార్కెట్‌లో బ్రాండ్‌ బియ్యం 25 కిలోల బస్తా ధర జూన్‌ నెలలో రూ.1300 ఉండేది. కానీ ప్రస్తుతం అదే బ్యాగు ధర రూ.1670కు చేరుకుంది. దీంతో వినియోగదారులపై మూడు నెలల కాలంలో రూ.370 భారం పడడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

  • అసలే శ్రావణమాసం.. వరుసగా పండుగల సీజన్‌ వస్తోంది. పిండి వంటలు చేయాలి. కానీ మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు చూస్తుంటే.. సామాన్యులు ఏం కొనలేం అన్నట్టు ఉంది పరిస్థితి. ఉల్లి ఘాటెక్కింది. కిలో రూ.55 నుంచి రూ.60కు చేరుకుంది. పంచదార రూ.75కు చేరుకుంది. చింతపండు రూ.80 చేరుకుంది. బియ్యం రేట్లు అమాంతం పెరిగిపోయాయి. వంటనూనెల ధరలు సలసల కాగుతున్నాయి. ఇలా నిత్యావసరాల ధర పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఇంటి బడ్జెట్‌ 20 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. ఎల్‌నినో ప్రభావంతో.. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అన్నింటా ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

  • జెట్‌స్పీడుతో పంచదార..

  • ఉదయం టీ నుంచి పంచదారతో మొదలయ్యే అనుబంధం రాత్రివరకూ ఏదో రూపంలో కొనసాగుతోంది. పండుగలు, వ్రతాల సమయంలో పంచదార వినియోగం ఎక్కువే. కానీ కొంతకాలంగా పంచదార ధర పెరుగుతోంది. నెల రోజుల వ్యవధిలోనే కిలో రూ.50 నుంచి రూ.75కి పెరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ అవసరాలకు నెలకు 800 మెట్రిక్‌ టన్నుల వరకూ పంచదారను వినియోగిస్తున్నారు. గృహ అవసరాల కంటే హోటళ్లు, స్వీట్‌ సెంటర్లలోనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. పంచదార ధర పెంపుతో జిల్లా ప్రజలపై 50శాతం అదనపుభారం పడినట్టు అయ్యింది.

  • సన్నబియ్యం..

  • జిల్లాలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు ఎక్కువగా సన్నబియ్యం వినియోగిస్తారు. 20 రకాల బ్రాండ్ల వరకూ సన్నబియ్యం అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా సమీర, లలిత, బెల్‌, అక్షయ వంటి బ్రాండ్లను వినియోగిస్తుంటారు. గత రెండు నెలల కాలంలో 25 కిలోల బస్తాపై రూ.370 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జూన్‌లో బస్తా రూ.1,280- రూ.1,300 మధ్య ఉండేది. ప్రస్తుతం రూ.1,600, రూ.1,670 వరకూ చేరుకుంది. ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబంలో రోజుకు సగటున కిలో చొప్పున నెలకు 30కిలోల వరకూ వినియోగిస్తున్నారు. దీంతో ఖర్చు భారీగా పెరుగుతోంది. ఇటీవల రాయితీపై రైతుబజార్లలో ప్రత్యేక స్టాళ్ల ద్వారా సన్న బియ్యాన్ని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జిల్లాలో అరకొరగానే అందిస్తున్నట్టు తెలుస్తోంది.

  • నూనెల ధరలు..

  • వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయి. వేరుశెనగ నూనె కిలో రూ.185 నుంచి రూ.190 మధ్య పలుకుతోంది. సన్‌ఫ్లవర్‌ నూనె రూ.180 నుంచి రూ.185కి చేరింది. పామోలిన్‌ ఆయిల్‌ అయితే రూ.160కు చేరుకుంది. అలాగే కందిపప్పు ధర రూ.150, వేరుశెనగ రూ.170పై మాటే. ఇలా అన్నిరకాల ధరలు పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరల నియంత్రణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

  • బతుకు భారం

  • నిత్యావసరాల ధరలు దారుణంగా ఉన్నాయి. ప్రతి వస్తువుపై 50 నుంచి 100 శాతం పెరిగింది. నిత్యం వినియోగించే బియ్యం, పంచదార, నూనెల ధరలు అదుపులో లేవు. కుటుంబ జీవనం చాలా కష్టంగా మారుతోంది. ఇలా అయితే ఎలా బతికేది.

  • - చిన్నమ్ముడు, గృహిణి, రణస్థలం

  • దారుణంగా పెంపు..

  • శ్రావణమాసం. ఆపై పూజల కాలం. ఇటువంటి సమయంలో నిత్యావసరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చాలామంది పూజలు చేయడమే మానేశారు. పంచదార పెరిగిందని స్వీట్ల ధర పెంచేస్తున్నారు. నూనెల ధరలు పెరిగాయని చెప్పి మిగతా ధరలు పెరిగిపోతున్నాయి. ఇలా అయితే చాలా కష్టం.

  • - రమణమ్మ, గృహిణి, రణస్థలం

Updated Date - Aug 30 , 2026 | 12:05 AM