ఇంత నిర్లక్ష్యమా?
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:16 AM
Dissatisfaction over flyover construction ‘జాతీయ రహదారి విస్తరణ, ఫ్లైఓవర్ పనులు చేసే విధానం ఇదేనా? పనులు సకాలంలో చేయండి. లేదంటే తప్పుకోండి’ అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రణస్థలం ఫ్లైఓవర్ నిర్మాణంపై కలెక్టర్ అసంతృప్తి
సర్వీసు రోడ్డు పక్కాగా లేకపోవడంతో ప్రమాదాలు
దానికి బాధ్యులు ఎవరంటూ ఎస్పీ ఆగ్రహం
రణస్థలం, జూలై 4(ఆంధ్రజ్యోతి): ‘జాతీయ రహదారి విస్తరణ, ఫ్లైఓవర్ పనులు చేసే విధానం ఇదేనా? పనులు సకాలంలో చేయండి. లేదంటే తప్పుకోండి’ అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం రణస్థలంలో ఫ్లైఓవర్ నిర్మాణం, జాతీయ రహదారి విస్తరణ పనులను ఎస్పీ మహేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు. వర్షం కురుస్తున్నా.. రెండు గంటలపాటు పనులను పర్యవేక్షించారు. కొన్నిచొట్ల అడ్డంగా చిరు దుకాణాలు, షాపులు ఉండడాన్ని గమనించి తక్షణమే తొలగించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. తహసీల్దారు కార్యాలయం సమీపంలో అక్రమంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్‌ను తొలగించాలని సూచించారు. ముందుగా తహసీల్దారు కార్యాలయంలో ఫ్లైఓవర్‌తో పాటు జాతీయ రహదారి విస్తరణ పనులపై అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఫ్లైఓవర్ నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. ‘ఆర్టీసీ బస్సులతోపాటు స్థానికంగా నిలపాల్సిన వాహనాలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలి. హైవేకు ఆనుకొని ఉన్న ఆర్‌అండ్‌బీ బంగ్లా, పాత పోస్టాఫీసు, పాత బస్టేషన్ ప్రదేశాల్లో యూటర్న్ తీసుకొని బస్సులు వచ్చేలా ఇన్‌గేట్, అవుట్‌గేట్లను సిద్ధం చేయాలి. ఆర్‌అండ్‌బీ బంగ్లా స్థలంలో వంతెన నిర్మాణ పనులకు సంబంధించి పెట్రోల్ బంకును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలి. సర్వీసు రోడ్లను పక్కాగా తీర్చిదిద్దకపోతే ఊరుకునేది లేద’ని కలెక్టర్ హెచ్చరించారు.
మీ నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కూడా కాంట్రాక్టర్ ప్రతినిధులకు గట్టిగానే హెచ్చరించారు. ఫ్లైఓవర్ పనులు ప్రారంభానికి ముందే జాతీయ రహదారికి అప్రోచ్‌రోడ్డు నిర్మాణాన్ని పక్కాగా చేపట్టాలని ఆదేశించినా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం మూలంగా ప్రమాదాలు జరిగి ప్రజలు మూల్యం చెల్లించుకున్నారన్నారు. ఇకపై ప్రమాదాలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థదేనని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో హైవే పీడీ ప్రభత్ రంజన్, మేనేజర్ రాధాకృష్ణ, డీఎస్పీ వివేకానంద, సీఐ ఎం.అవతారం, తహసీల్దార్ సనపల కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.