Share News

ఉప తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:12 AM

వివాదాస్పద భూములకు సంబంధించి భోగాపురం ఉపతహసీల్దార్‌ సంతకాన్ని ఓ రెవెన్యూ సిబ్బంది ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉప తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ

-ఓ రెవెన్యూ ఉద్యోగిపై ఆరోపణలు

-కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేస్తానంటున్న డీటీ

-భోగాపురం తహసీల్దార్‌ కార్యాలయంలో ఘటన

భోగాపురం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): వివాదాస్పద భూములకు సంబంధించి భోగాపురం ఉపతహసీల్దార్‌ సంతకాన్ని ఓ రెవెన్యూ సిబ్బంది ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ వివరాలన్నీ సక్రమంగా ఉన్నట్లు రికార్డులో నమోదు చేసి, అందులో ఉపతహసీల్దార్‌ సంతకం చేసి, ఆయన లాగిన్‌లో ఓకే చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సంబంధిత డీటీ సిద్ధమవుతున్నారు.

ఏం జరిగిందంటే..

మండలంలోని కొంతమంది రైతులు ఎఫ్‌లైన్‌లో భూమిని కొలవడానికి, హద్దులు చూపించడానికి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్లోని వివరాలు సక్రమంగా ఉన్నాయా? లేవా అన్నది గ్రామ సర్వేయర్లు పరిశీలించాలి. అన్ని సక్రమంగా ఉంటే సంబంధిత రైతులకు నోటీసులు అందించి.. భూమిపైకి వెళ్లి సర్వే చేయాల్సి ఉంది. అనంతరం మండల సర్వేయర్‌ రీ వెర్‌ఫికేషన్‌ చేసి అనంతరం ఉపతహసీల్దార్‌కి ఫైల్‌ అందించాలి. అనంతరం ఉపతహసీల్దార్‌ పరిశీలించి అంతా సరిపోతే సంతకం పెట్టి తన లాగిన్‌లో డిజిటల్‌ కీ ద్వారా ఒకే చేయాల్సి ఉంది. అయితే, కొంగవానిపాలెం గ్రామంలో కొన్ని వివాదాస్పద భూములు న్యాయస్థానంలో ఉన్నాయి. ఈ భూములకు సంబంధించి దరఖాస్తులు సక్రమంగా లేకపోయినా, అన్ని వివరాలు బాగున్నట్లు ఓ రెవెన్యూ సిబ్బంది రికార్డుల్లో నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మండల సర్వేయర్‌, ఉపతహసీల్దార్‌ రీ వెరిఫికేషన్‌ లేకుండానే, అన్నీ సక్రమంగా ఉన్నట్లు ఉపతహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ దగ్గర డిజిటల్‌ కీ తీసుకుని ఉపతహసీల్దార్‌ లాగిన్‌లో ఆ భూములను ఒకే చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఆ సంతకాన్ని చూసి ఉపతహసీల్దార్‌ పి.హరి కంగుతిన్నారు. మరోసారి అన్ని పరిశీలించి తన సంతకం ఫోర్జరీ జరిగిందని నిర్ధారించుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేస్తా..

కొంగవానిపాలెం గ్రామ సర్వేయర్‌ నల్లా శంకరరావు నా సంతకం ఫోర్జరీ చేశాడు. భూములను పరిశీలించకుండా, మండల సర్వేర్‌ రీ వెరిఫికేషన్‌ లేకుండానే నేను సంతకం చేసినట్లు రికార్డులో నమోదు చేశాడు. నేను డిజటల్‌ కీ ఇవ్వమన్నానని ఆపరేటర్‌కి చెప్పి తీసుకున్నాడు. కొన్ని ఫైళ్లతో పాటు న్యాయస్థానంలో ఉన్న వివాదాస్పద భూములను కూడా నా లాగిన్‌లో ఒకే చేసేశాడు. ఈ విషయాన్ని తహసీల్దార్‌ దృష్టికి తీసుకువెళ్లాను. కలెక్టర్‌, ఎస్పీ, జిల్లా సర్వేయర్‌కి, స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తా.

-పి.హరి, ఉపతహసీల్దార్‌, భోగాపురం.

ఫోర్జరీ చేయలేదు

నేను ఎవరి సంతకాన్ని ఫోర్జరీ చేయలేదు. ఈ విషయాన్ని ఉప తహసీల్దార్‌కు చెప్పినా నమ్మడం లేదు.

-నల్లా శంకరరావు, గ్రామ సర్వేయర్‌, కొంగవానిపాలెం

Updated Date - Feb 14 , 2026 | 12:12 AM