ఏపీ పీజీఈసెట్‌లో సిక్కోలు సత్తా
ABN , Publish Date - May 15 , 2026 | 12:19 AM
AP PGECET results ఆంధ్ర యూనివర్శిటీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఏపీ పీజీఈసెట్- 2026 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఏప్రిల్ 28 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు.
93.53 శాతం ఉత్తీర్ణత సాధించిన జిల్లా విద్యార్థులు
వివిధ విభాగాల్లో ఆరుగురికి టాప్ ర్యాంకులు
శ్రీకాకుళం, మే 14(ఆంధ్రజ్యోతి) : ఆంధ్ర యూనివర్శిటీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఏపీ పీజీఈసెట్- 2026 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఏప్రిల్ 28 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో జిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులు వివిధ విభాగాల్లో రాష్ట్రస్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించి సిక్కోలుకు గర్వకారణంగా నిలిచారు.
రాష్ట్రవ్యాప్తంగా 9,990 మంది విద్యార్థులు పీజీఈసెట్ రాయగా సగటు ఉత్తీర్ణత 93.29 శాతంగా నమోదైంది. మన జిల్లా విద్యార్థులు రాష్ట్ర సగటును మించి 93.53 శాతం పాస్ పర్సంటేజీతో సత్తా చాటడం విశేషం. శ్రీకాకుళం పరీక్షా కేంద్రం నుంచి మొత్తం 524 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 448 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 419 మంది అర్హత సాధించారు. జిల్లాకు చెందిన ఆరుగురు రాష్ట్రస్థాయి టాప్ ర్యాంకుల్లో సత్తాచాటారు.
కోటబొమ్మాళి మండలం కొత్తపేటకు చెందిన గొడుగుట్ల మహేష్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 81 మార్కులతో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించాడు.
గార మండలం శ్రీకూర్మం గ్రామానికి చెందిన సంబరికి నరేష్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలోనే 75 మార్కులు సాధించి 6వ ర్యాంకులో నిలిచాడు.
ఆమదాలవలస మండలం కోరపాం గ్రామానికి చెందిన చేపేన వేదవతి ఇస్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో 40 మార్కులు సాధించి 7వ ర్యాంకు తెచ్చుకుంది.
ఎచ్చెర్ల మండలం కుశాలపురానికి చెందిన నంబూరు సతీష్ చంద్ర ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో 77 మార్కులతో 8వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు.
సోంపేట మండలం బట్టిగల్లూరు గ్రామానికి చెందిన బట్టి శ్రీరామ్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 70 మార్కులు సాధించి 9వ ర్యాంకు దక్కించుకున్నాడు.
శ్రీకాకుళం నగరం డీసీసీబీ కాలనీకి చెందిన తమ్మినేని శివ కుమార్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో 88 మార్కులతో 11వ ర్యాంకులో నిలిచాడు.