Share News

యూరియా కోసం పాట్లు

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:31 AM

యూరియా కోసం రైతులు పాట్లు పడుతున్నారు. రెండు రోజులుగా రైతుసేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

యూరియా కోసం పాట్లు
మర్రిపాడు రైతు సేవా కేంద్రం వద్ద మంగళవారం ఉదయం 6 గంటలకే వేచిఉన్న రైతులు

- రెండు రోజులుగా రైతుల పడిగాపులు

-అవగాహన కల్పించడంలో అధికారుల విఫలం

మెళియాపుట్టి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రైతులు పాట్లు పడుతున్నారు. రెండు రోజులుగా రైతుసేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో మోస్తరుగా వర్షాలు పడుతుండడంతో వరి ఎదలకు ఎరువులు జల్లుకునేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. దీంతో అధికారులు సోమవారం నుంచి యూరియా పంపిణీ చేస్తున్నారు. అయితే, భూమి విస్తీర్ణం బట్టి ఎరువులు అందిస్తామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కానీ, కొన్నిచోట్ల తక్కువ భూమి ఉన్న రైతులకు అధికంగా ఎరువులు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో యూరియా దొరకదనే ఉద్దేశంతో రైతులు ఉదయం నుంచి రాత్రి వరకు రైతుసేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే సీజన్‌ ప్రారంభమైతే ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుసేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాయలేని రైతులు ఒడిశాలోని గారబంద, పర్లాఖిమిండి, ఉప్పలాడ వంటి ప్రాంతాలకు వెళ్లి బస్తా యూరియాను రూ.వెయ్యి నుంచి రూ.1200కు కొనుగోలు చేస్తున్నారు. ఎరువుల వాడకంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు ఉన్నాయి. ఎంత ఎరువు వచ్చింది, ఎక్కడ పంపిణీ చేస్తారు.. ఎప్పుడు అందిస్తారో ముందుగా తెలియజేస్తే ఇటువంటి ఇబ్బందులు ఉండవని రైతులు అంటున్నారు.

Updated Date - Jul 08 , 2026 | 12:31 AM