చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:03 AM
Rs 3.62 crore distributed to 1,449 people చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం కోటబొమ్మాళి మండలం తిలారులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
జిల్లాలో 1,449 మందికి రూ.3.62 కోట్లు పంపిణీ
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
తిలారులో రూ.7కోట్లతో అభివృద్ధి పనులు
కోటబొమ్మాళి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం కోటబొమ్మాళి మండలం తిలారులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 1,449 మంది చేనేత కార్మికులకు ‘నేతన్నల సేవలో’ పథకం కింద రూ.25వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి రూ.3.62కోట్ల నమూనా చెక్కును పంపిణీ చేశారు. అలాగే తిలారులో రూ.7కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. బీసీ వసతిగృహం, జిల్లాపరిషత్ పాఠశాల, ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన వస్త్ర ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. నారాయణపురం, పెద్దబమ్మిడి, చిన్నబమ్మిడి గ్రామస్థులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ ‘చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నాం. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రేగులపాడు మీదుగా జర్జంగి, పిండ్రువాడ రహదారికి అనుసంధానం చేస్తాం. ఈ మార్గంలో అవసరమైన చోట వంతెన నిర్మిస్తాం. గత ప్రభుత్వ హయాంలో రీసర్వే పేరుతో భూముల రికార్డులు అస్తవ్యస్తం చేశారు. ప్రస్తుతం వాటిని సరిచేసి రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తున్నామ’ని తెలిపారు. తిలారు కోనేరును ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
ధర్మాన సోదరులు జిల్లాకు చేసిందేమిటి?
‘వైసీపీ ప్రభుత్వ హయాంలో గొడ్డలిపార్టీ అధ్యక్షుడు రాష్ట్రాన్ని కనీసం పట్టించుకోలేదు. ప్రస్తుతం వైసీపీ నేతలకు రాజకీయ విమర్శలు చేసే నైతిక హక్కు లేదు’ అని మంత్రి అచ్చెన్న పేర్కొన్నారు. గతంలో మంత్రులుగా ఉన్న ధర్మాన సోదరులు ప్రసాదరావు, కృష్ణదాస్ జిల్లాకు ఒక్క మంచి పని కూడా చేయలేదని, ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడు పథకం పేరిట సుమారు రూ.5వేల కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపినా.. అనేక ప్రాంతాల్లో పనులు పూర్తికాలేదు. మొండిగోడలే మిగిలాయి. వైసీపీ పాలనంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఉపాధ్యాయ ఉద్యోగాల గురించి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంద’ని మంత్రి అచ్చెన్న పేర్కొన్నారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. ‘నేతన్నలు తయారు చేసిన వస్త్రాలను ‘లోకల్ ఫర్ లోకల్’ పథకం పేరుతో మహిళా సమైఖ్య సంఘాల ద్వారా విక్రయిస్తాం. పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు ఉంటే.. వెంటనే తహసీల్దార్‌ను కలిసి సరిచేసుకోవాల’ని సూచించారు. కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, టెక్కలి ఆర్డీవో ఎన్.కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ తర్ర రామకృష్ణ, వెలమల విజలక్ష్మి, కామేశ్వరరావు, రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, టీడీపీ నేతలు కర్రి అప్పారావు, బోయిన సత్యశ్రీనివాస్, రెడ్డి అప్పన్న, బోయిన రమేష్, చేనేత సంఘం నాయకులు పాల్గొన్నారు.