Share News

నిర్లక్ష్యం వీడండి.. సమయపాలన పాటించండి

ABN , Publish Date - May 12 , 2026 | 12:46 AM

District Central Hospital surprise inspection ‘వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వీడుతారా.. చర్యలు తీసుకోమంటారా?’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సోమవారం టెక్కలిలో జిల్లా కేంద్రాసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నిర్లక్ష్యం వీడండి.. సమయపాలన పాటించండి
జిల్లా కేంద్రాసుపత్రిలో పరిస్థితిని పరిశీలిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

లేదంటే చర్యలు తప్పవు

వైద్యులు, సిబ్బందికి మంత్రి అచ్చెన్న హెచ్చరిక

జిల్లా కేంద్రాసుపత్రి ఆకస్మిక తనిఖీ

టెక్కలి, మే 11(ఆంధ్రజ్యోతి): ‘వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వీడుతారా.. చర్యలు తీసుకోమంటారా?’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సోమవారం టెక్కలిలో జిల్లా కేంద్రాసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9గంటలకు రావాల్సిన వైద్యులు, వైద్య సిబ్బంది.. దాదాపు గంట ఆలస్యంగా విధులకు హాజరుకావడంపై అసహనం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వీడాలని, సమయపాలన పాటించాలని.. లేదంటే చర్యలు తప్పవని వైద్యులు, సిబ్బందిని మంత్రి అచ్చెన్న హెచ్చరించారు. చిన్నపాటి జ్వరంతో వచ్చిన రోగులను కూడా రిఫర్‌ చేస్తున్నట్టు ఫిర్యాదులొస్తున్నాయని, ఈ విధానాన్ని మార్చుకుని పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందజేయాలని స్పష్టం చేశారు.

నీటి కొరత ఎందుకొచ్చింది?

జిల్లా కేంద్రాసుపత్రిలో నీటి కొరత విషయమై ఈ నెల 10న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనంపై మంత్రి అచ్చెన్న ఆరా తీశారు. ఆస్పత్రికి అవసరమైన నీరు ఎందుకు తగ్గిందని సంబంధిత ప్లంబర్‌ లంబ నారాయణ, డయాలసిస్‌ విభాగం ప్రతినిధి సీతారామ్‌ను ప్రశ్నించారు. నీటి ఎద్దడి సమస్య అధికారులకు కానీ, తమ దృష్టికి కానీ ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఇష్టమైతే బాధ్యతగా పనిచేయండి.. లేదంటే వెళ్లిపోండని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో నీటి కొరత అంశంపై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.సూర్యారావు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రాసుపత్రి అభివృద్ధికి నేను కృషి చేస్తుంటే మీరు బదలాం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై కలెక్టర్‌తో మంత్రి ఫోన్‌లో మాట్లాడి.. 36గంటల్లో త్రీమెన్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఆస్పత్రిలో కిటికీల అద్దాలు వేయాలని, మరుగుదొడ్లు, తలుపులు బాగు చేయాలని, ట్యాప్‌లు, ఫ్యాన్లు మరమ్మతులు చేయాలని సిబ్బందికి సూచించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మంజూరు చేసిన 20 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో బెడ్స్‌, ఆపరేషన్‌ టేబుల్స్‌, పల్స్‌ ఆక్టోమీటర్స్‌ వంటి సామగ్రిని మంత్రి ప్రారంభించారు. వీటిని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.

Updated Date - May 12 , 2026 | 12:46 AM