Share News

రూ.8.15 లక్షల చోరీ సొత్తు స్వాధీనం

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:28 PM

సుమారు మూడేళ్లుగా దొంగ తనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఆరుగురు నిందితులను ఆదివారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై జర్జంగి గ్రామ సమీపంలో ఎస్‌ఐ వి. సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు.

రూ.8.15 లక్షల చోరీ సొత్తు స్వాధీనం
మాట్లాడుతున్న టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు

కోటబొమ్మాళి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): సుమారు మూడేళ్లుగా దొంగ తనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఆరుగురు నిందితులను ఆదివారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై జర్జంగి గ్రామ సమీపంలో ఎస్‌ఐ వి. సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సిఐ కె. శ్రీనివాసరావుతో కలిసి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ లక్ష్మణరావు మాట్లాడుతూ విజయనగరం జిల్లా భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన ఎం.రాము, నెల్లి మోహనరావు, పోతుల శ్రీను, ఎం.నాగరాజు, ఎం.శ్రీనివాస్‌, నెల్లి రఘుబాబులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇందులో రాము విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్‌, అల్యూమినియం దొంగిలించేవాడని చెప్పారు. నిందితుల నుంచి రూ.8.15 లక్షల విలువైన 607 కేజీల రాగి, 20 కేజీల వెండి, ఆరు సెల్‌ఫోన్లు, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం స్వాఽధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. నిందితులపై కోటబొమ్మాళి మండలంలో ఆరు, లావేరు, జలుమూరు, టెక్కలి, మందస మండలాల్లో మూడేసి చొప్పున, జేఆర్‌పురంలో రెండు, నందిగాం, ఎచ్చెర్ల, పాతపట్నం, కవిటి మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. దొంగిలించిన రాగి, వెండిని కాల్చి ముద్దగా చేసి... ఎక్కువ రేటు వచ్చినప్పుడు అమ్ముకుందామనే ఉద్దేశంతో దాచి ఉంచారని ఆయన తెలిపారు. ఆదివారం కూడా ఎక్కడెక్కడ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయో గుర్తించేందుకు రెక్కీ చేస్తూ తమకు చిక్కారని వివరించారు. ఈ ఆరుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. వీరిని పట్టుకున్న ఎస్‌ఐ సత్యనారాయణ, కానిస్టేబుల్‌ బాలరాజు, చంద్రశేఖర్‌లను అభినందించారు.

Updated Date - Feb 01 , 2026 | 11:28 PM