నాగావళి నదీతీరం అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:59 PM
కలెక్టరేట్ నుంచి పీజీపేట వరకు రోడ్డు వెడల్పు చేస్తున్నామని, నాగావళి నదీ తీరం అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు.
అరసవల్లి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్ నుంచి పీజీపేట వరకు రోడ్డు వెడల్పు చేస్తున్నామని, నాగావళి నదీ తీరం అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. గురువా రం శ్రీకాకుళంలోని 31వ డివిజన్ పరిధిలోగల కార్గిల్ విక్టరీ పార్కును నగరపాలకసంస్థ కమిషనర్, సుడా అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్కులో రీడింగ్ రూమ్, మినీ ఓపెన్ థియేటర్, బాక్స్ క్రికెట్, షటిల్ కోర్టు, కార్గిల్‌వీరుల విజయపతాకం, వ్యాయామ ఉపకర ణాలు ఏర్పాటుచేస్తున్నామని, మరో మూడునెలల్లో పార్కును అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు విభూది సూరిబాబు, మునిసిపల్ అధికారి సుగుణాకరరావు పాల్గొన్నారు.
కల్తీ నెయ్యి పాత్రధారులను వదిలేది లేదు
తిరుమల ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ప్రాత్రధారులను వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. గురువారం శ్రీకాకుళంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించారని ఆరోపించారు. సిట్ నివేదికలో వాస్తవాలు వెల్లడికావడంతో వైసీపీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైందన్నారు. హిందూధర్మాన్ని నాశనం చేసేందుకు ఆలయాలపై దాడులు, విధ్వంసానికి పాల్పడ్డారన్నారు.కూటమిప్రభుత్వం అధికారంలోకివచ్చాక ఆలయాల కమిటీల్లో అన్ని కులాల వారికి సమాన ప్రాతినిథ్యం కల్పించామన్నారు. రథసప్తమి వేడుకలసందర్భంగా కొంతమంది భక్తులు ఇబ్బందిపడిన మాట వాస్తవమేనని, అంచనాలకు మించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఇబ్బందిపడిన వారికి క్షమాపణలు చెబుతున్నామని చెప్పారు. వచ్చే ఏడాది రథసప్తమికి ఇప్పట్నుంచే రోడ్లు వెడల్పు చేయడంతోపాటు ఆలయ పరిసరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం మహా పాపం నిజం పేరుతో కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస.రమేష్, నగర టీడీపీ అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, ప్రధాన విజయరాం పాల్గొన్నారు.