Share News

ఆ ముగ్గురికి..

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:27 AM

Best Teacher Awards రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా నుంచి ముగ్గురిని విద్యాశాఖ ఎంపిక చేసింది. సెకండరీగ్రేడ్‌ ఉపాధ్యాయ కేటగిరీలో జలుమూరు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుడు మెండ రామారావు, స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగంలో(గణితం) ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అల్లు అప్పన్న, హెచ్‌ఎం విభాగంలో జలుమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యతిరాజుల హేమసుందర్‌ను రాష్ట్రస్థాయి అవార్డులు వరించాయి.

ఆ ముగ్గురికి..
రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన అల్లు అప్పన్న, హేమసుందర్‌, మెండ రామారావు

  • రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

  • రేపు అమరావతిలో ప్రదానం

  • శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌/ ఎచ్చెర్ల/జలుమూరు, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా నుంచి ముగ్గురిని విద్యాశాఖ ఎంపిక చేసింది. సెకండరీగ్రేడ్‌ ఉపాధ్యాయ కేటగిరీలో జలుమూరు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుడు మెండ రామారావు, స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగంలో(గణితం) ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అల్లు అప్పన్న, హెచ్‌ఎం విభాగంలో జలుమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యతిరాజుల హేమసుందర్‌ను రాష్ట్రస్థాయి అవార్డులు వరించాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ ముగ్గురూ అమరావతిలో సీఎం చంద్రబాబు చేతులమీదుగా రాష్ట్రస్థాయి అవార్డులు అందుకోనున్నారు.

  • జలుమూరు మండలం చల్లవానిపేటకు చెందిన మెండ రామారావు.. 2010లో తొలిసారిగా సంతబొమ్మాళి మండలం పిట్టవానిపేటలో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టారు. అంకితభావం, నిబద్ధతతో విధులు నిర్వర్తించారు. 2023లో జలుమూరు ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వచ్చారు. అప్పటికి 9 మంది విద్యార్థులు ఉండగా.. ఆ సంఖ్య 86కి పెంచారు. మరోవైపు మెరుగైన బోధన కారణంగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా అప్‌గ్రేడ్‌ అయింది. విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడం, సంఘసేవ లక్షణాలు అలవర్చడం చేశారు. ఈ నేపథ్యంలో గతేడాది రాష్ట్ర ఉత్తమ పాఠశాలగా, ఈ ఏడాది జాతీయ ఉత్తమ పాఠశాలగానూ ఎంపికై అవార్డు లభించింది. తాజాగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని రామారావు తెలిపారు. పాఠశాల అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రతకు గుర్తింపుగా తనకు ఈ అవార్డు లభించిందన్నారు.

  • శ్రీకాకుళం నగరానికి చెందిన యతిరాజుల హేమసుందర్‌.. 1999లో స్కూల్‌అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాధ్యతలు చేపట్టారు. 27 ఏళ్ల సర్వీసులో.. విద్యార్థుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అనేక పాఠ్యపుస్తకాలు రాశారు. పాఠశాలల్లో పచ్చదనం పరిశుభ్రతకు పాటుపడ్డారు. సీతంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. గతేడాది జలుమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చారు. కాగా.. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన హేమసుందర్‌, రామారావును ఎంఈవోలు మాధవరావు, ప్రసాదరావు, పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.

  • డిప్యూటీ డీఈవోగా కూడా..

  • జలుమూరు మండలం శ్రీముఖలింగానికి చెందిన అల్లు అప్పన్న.. ఓవైపు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడితోపాటు.. మరోవైపు ఇటీవల నిర్వహించిన ఏపీపీఎస్సీలో డిప్యూటీ డీఈవోగా కూడా ఎంపిక కావడం విశేషం. ఈయన 2003 డీఎస్సీ ద్వారా ఎంపికై 2005లో ఎస్జీటీగా నియమితులయ్యారు. 2012లో గణిత శాస్త్ర స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. అలాగే జాతీయ, రాష్ట్రస్థాయి సెకండరీ స్థాయి గణిత పుస్తకాల రచయితగా, మనోవికాస తరగతుల నిర్వహణ కర్తగా, కెరీర్‌ గైడెన్స్‌ కౌన్సెలర్‌గా వ్యవహరించారు. వమరవల్లి డైట్‌ కళాశాలలో మనో విజ్ఞానశాస్త్ర అధ్యాపకుడిగా డిప్యుటేషన్‌పై ఐదేళ్లపాటు పనిచేశారు. ప్రస్తుతం ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇక్కడ ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయునిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది జనవరిలో సిల్వర్‌ జూబ్లీ కార్యక్రమాన్ని మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. గ్రామస్థుల సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషిచేశారు. ఈ పాఠశాలను జిల్లాలో ఉత్తమ పాఠశాలగా నిలిచేలా కీలకపాత్ర పోషించారు. ఎందరో విద్యార్థులకు గణితంపై అభిరుచి పెంచేలా బోధన సాగించారు. ఓ వైపు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా, మరోవైపు జోన్‌-2కు డిప్యూటీ డీఈవోగా ఎంపిక కావడంతో శ్రీముఖలింగం గ్రామస్థులతోపాటు కేశవరావుపేట జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం బుడుమూరు గోవిందరావు, ఎంపీటీసీ సూర జగదీష్‌, మాజీ సర్పంచ్‌లు పైడి భాస్కరావు, పొందూరు భీమారావు తదితరులు అభినందించారు.

Updated Date - Sep 04 , 2026 | 12:27 AM