అండగా నిలిచి...కారులో తరలించి
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:27 PM
కొత్తకోట సమీపంలో అలికాం-బత్తిలి ప్రధాన మార్గంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది.
- రోడ్డు ప్రమాదంపై స్పందించిన ఎమ్మెల్యే
- సొంతకారులో ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
- ఆటోలో మరో బాధితుడితో వెళ్లిన కూన రవికుమార్
సరుబుజ్జిలి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కొత్తకోట సమీపంలో అలికాం-బత్తిలి ప్రధాన మార్గంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సమయంలో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే కూన రవికుమార్ తక్షణం స్పందించి క్షతగాత్రులను తన కారులో తరలించి తక్షణం వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించారు. వివరాల్లోకి వెళితే.. సరుబుజ్జిలి నుంచి ఆమదాలవలస వైపు ప్రయాణికులతో ఆటో వెళుతుండగా కుక్కలు అడ్డుగా రావడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న నక్కలపేటకు చెందిన సింగుపురపు సునీత, కొత్తకోటకు చెందిన పోతురాజు రాములతో పాటు ఆటో డ్రైవర్ తిరుపతిరావు గాయపడ్డారు. అదే సమయంలో సరుబుజ్జిలి వైపు వస్తున్న ఎమ్మెల్యే రవికుమార్ ఈ ప్రమాదాన్ని గమనించి తన కారును నిలుపుదల చేసి క్షతగాత్రులను పరిశీలించారు. తక్షణం తన కారులో వారిని ఆమదాలవలస సీహెచ్‌సీకి తరలించారు. వీరిలో తీవ్ర గాయాలైన రామును శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించేందుకు అంబులెన్స్ కోసం ఎదురుచూశారు. వాహనం వచ్చేందుకు ఆలస్యం అవుతుండడంతో ఎమ్మెల్యే మరో ఆటోలో అతడిని ఎక్కించుకుని ఆసుపత్రికి బయలుదేరి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆటోలో వెళుతున్న సమయంలో రొట్టవలస సమీపంలో 108 వాహనం తారసపడడంతో క్షతగాత్రుడిని ఆ వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఔట్‌పోస్టు పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు సింగిపురపు సునీత ఫిర్యాదుతో ఏఎస్‌ఐ సీహెచ్ చంద్రినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.