Share News

సం‘క్షేమమేనా’?

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:04 AM

Hostel students problems జిల్లాలోని ప్రభుత్వ వసతిగృహాలకు సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో వసతితోపాటు విద్యాబోధనపై ఆ ప్రభావం పడుతోంది. అలాగే తగినంత కుక్‌లు లేకపోవడం, వంట శాల ప్రాంగణాల్లో పారిశుధ్యం లోపించడం తదితర కారణాలతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం కరువవుతోంది.

సం‘క్షేమమేనా’?

  • ప్రభుత్వ వసతిగృహాల్లో సిబ్బంది కొరత

  • వార్డెన్లు లేక పర్యవేక్షణ కరువు

  • నాలుగో తరగతి ఉద్యోగులు సైతం అరకరే

  • విద్యార్థుల వసతి, ఆహారంపై ప్రభావం

  • ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ వసతిగృహాలకు సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో వసతితోపాటు విద్యాబోధనపై ఆ ప్రభావం పడుతోంది. అలాగే తగినంత కుక్‌లు లేకపోవడం, వంట శాల ప్రాంగణాల్లో పారిశుధ్యం లోపించడం తదితర కారణాలతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం కరువవుతోంది. జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టళ్లు 63 ఉన్నాయి. వీటిలో 126 మంది కుక్‌లు అవసరం కాగా.. కేవలం 22 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దశాబ్దాలుగా 104 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కమాటీలు 63 మందికిగాను కేవలం 35 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 63 హాస్టళ్లకు అసలు వాచ్‌మెన్లే లేరు. దీంతో రక్షణ కొరవడుతోంది. ఇలా హాస్టళ్లలో నాలుగో తరగతి పోస్టులు దశాబ్దాలుగా ఖాళీగా ఉంటున్నాయి. ప్రస్తుతం 168 మంది ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. చాలాచోట్ల కుక్‌లు లేకపోవడంతో దిగువస్థాయి సిబ్బందే కుక్‌లుగా అవతారమోత్తుతున్నారు. దీంతో ఆహారం తయారీలో నాణ్యత లోపిస్తోంది. కొన్ని సందర్భాఆల్లో ఆహారం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు.

  • గిరిజన సంక్షేమమూ.. అంతే

  • జిల్లాలో గిరిజన సంక్షేమ పాఠశాలలు సీతంపేట ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్నాయి. 47 ఆశ్రమ పాఠశాలలు, 12 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 102 మంది కుక్‌లు, కమాటీలు గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. అప్పట్లో సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో వార్డెన్లు సొంత డబ్బులతో పాటు హాస్టల్‌ నిర్వహణలో వచ్చే కొద్దిమొత్తం జీతానికి వీరిని నియమించుకున్నారు. ఒక్కొక్కరికీ నెలకు రూ.5 వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. తరువాత ఐటీడీఏ అధికారులు గుర్తించి స్పెషల్‌ గ్రాంట్‌ కింద కొంత నిధులను వీరి జీతాలకు కేటాయించారు. అయితే ఐటీడీఏ వద్ద నిధులు లేకపోవడంతో ఇప్పుడు వార్డెన్లే చెల్లిస్తున్నారు. కానీ దశాబ్దాలుగా పనిచేస్తున్నందున తమను ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా గుర్తించాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. కోర్టును సైతం ఆశ్రయించారు. దీంతో ఉన్నతాధికారులు వీరిని తొలగించారు. అక్కడున్న దిగువస్థాయి సిబ్బంది కుక్‌లుగా అవతారమెత్తారు.

  • తగ్గిన విద్యార్థుల సంఖ్య

  • ప్రభుత్వ వసతిగృహాల్లో వార్డెన్లు పూర్తిస్థాయిలో లేరు. మొత్తం అన్నిరకాల యాజమాన్యాలకు సంబంధించి 81 వసతిగృహాలు ఉన్నాయి. అందులో పూర్తిగా విద్యార్థులు లేనివి 3. ఇక 44 హాస్టళ్లకు మాత్రమే వార్డెన్లు ఉన్నారు. 34 హాస్టళ్లు ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం సుమారు 6,500 మంది విద్యార్థులు వసతిపొందుతున్నారు. గతంలో 9 వేల మంది విద్యార్థులుండేవారు. హాస్టళ్లపై పర్యవేక్షణ కొరవడడంతోనే అక్కడ చేర్పించేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

  • కొరత వాస్తవమే..

  • వసతిగృహాల్లో వార్డెన్లు, కుక్‌ల కొరత ఉంది. కమాటీలు, వాచ్‌మెన్లు కూడా లేరు. ప్రభుత్వం త్వరలో నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఎక్కడైనా నిబందనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధించి అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.

    - అనురాధ, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి, శ్రీకాకుళం

Updated Date - Feb 07 , 2026 | 12:04 AM