Share News

నేడు శ్రీకాకుళం-తిరుపతి రైలు ప్రారంభం

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:07 PM

: శ్రీకాకుళం-తిరుపతి హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ (17440/17439) రైలు సోమవారం పట్టాలెక్కనుంది.

 నేడు శ్రీకాకుళం-తిరుపతి రైలు ప్రారంభం

- హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం-తిరుపతి హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ (17440/17439) రైలు సోమవారం పట్టాలెక్కనుంది. శ్రీకాకుళం రోడ్‌ (ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌లో సోమవారం మధ్యాహ్నం కేంద్ర పౌర వియానాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఈ రైలుకు పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు. సుమారు 852 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు 17 గంటల 10 నిమిషాల్లో చేరుకుంటుంది. పత్రి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆమదాలవలస రైల్వే స్టేషన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం(మంగళవారం) 8:10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అదే విధంగా ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు (సోమవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీకాకుళం రోడ్‌ చేరుకుంటుంది. చీపురుపల్లి, విజయనగరం జంక్షన్‌, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట జంక్షన్‌, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్‌, తెనాలి జంక్షన్‌, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట జంక్షన్‌ల వద్ద ఈ రైలు ఆగనుంది. సామాన్య, మధ్యతరగతి ప్రయాణికుల సౌకర్యార్థం థర్డ్‌ ఏసీ (3ఏ) కోచ్‌లతో పాటుగా స్లీపర్‌ క్లాస్‌, సాధారణ (జనరల్‌) కోచ్‌లను కూడా అందుబాటులో ఉంచారు. సోమవారం జరగనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రైల్వే ఉన్నతాధికారులతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. బైక్‌ ర్యాలీగా ఆమదాలవలస రైల్వేస్టేషన్‌కు ప్రజలు చేరుకుని తిరుపతి ప్రయాణికులకు శుభాకాంక్షలు చెప్పనున్నారు.

Updated Date - Apr 12 , 2026 | 11:07 PM