శ్రీకాకుళం జడ్పీ పీఠం.. బీసీ మహిళకు
ABN , Publish Date - Oct 14 , 2026 | 12:12 AM
Alliance leaders target key positions శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు ఖరారైంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్‌కే తేజ మైలవరపు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం విడుదలైన ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో జిల్లా రాజకీయాల్లో జడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్న నేతల ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
కీలక పదవులపై కూటమి నాయకుల గురి
జనసేన సైతం జడ్పీ చైర్‌పర్సన్ పదవిపై ఆశలు
ఎమ్మెల్యే టికెట్లు దక్కని నేతలూ ఈసారి ప్రయత్నాలు
సామాజిక వర్గాలకు ప్రాధాన్యమివ్వాలని వినతులు
శ్రీకాకుళం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు ఖరారైంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్‌కే తేజ మైలవరపు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం విడుదలైన ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో జిల్లా రాజకీయాల్లో జడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్న నేతల ప్రయత్నాలు ఊపందుకున్నాయి. కూటమిలోని ప్రధాన పార్టీల నేతలు తమకు అనుకూలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు పావులు కదుపుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడినవారు సైతం ఈసారి జడ్పీ చైర్‌పర్సన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.
సామాజిక సమీకరణాలపై కసరత్తు
జిల్లాలో వెలమలు, కాళింగులతోపాటు మత్స్యకారులు, యాదవులు, కాపులు, రెడ్డిక సామాజిక వర్గాలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆయా వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని కూటమి నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకుళం వరకు వివిధ సామాజిక వర్గాల నేతలు తమకు స్థానిక సంస్థల్లో అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చి కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించినవారికీ ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయావకాశాలను మెరుగుపరచాలంటే స్థానిక ఎన్నికల్లో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గాల ప్రాతినిధ్యంతో పాటు పార్టీ కోసం పనిచేసిన నేతల సేవలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
జడ్పీ పీఠంపై కూటమి నేతల కన్ను
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని దక్కించుకోవాలని జనసేన నేతలు ఆశిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌తో సత్సంబంధాలున్న ఓ నాయకుడు తన సతీమణిని ఎన్నికల బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కీలక పదవిలో కొనసాగుతుండటంతో పాటు, ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆర్థిక వనరులు ఉన్నాయన్న ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోలేక పోవడం ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ పీరికట్ల విశ్వప్రసాద్ కుటుంబం నుంచి టీడీపీ తరపున అభ్యర్థిని బరిలోకి దింపే అంశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల్లో చివరి వరకు ఎమ్మెల్యే టికెట్ ఆశించి నిరాశకు గురైన కొందరు నేతలు సైతం ఇప్పుడు జడ్పీ చైర్‌పర్సన్ పదవిపై దృష్టి సారించారు.
రెండోసారి మహిళకే అవకాశం
టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-2019 మధ్య జరిగిన జడ్పీ ఎన్నికల్లో చౌదరి ధనలక్ష్మి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం వైసీపీ ప్రభుత్వ హయాంలో పిరియా విజయ ఈ పదవిలో కొనసాగారు. తాజాగా మరోసారి మహిళకే జడ్పీ పీఠం దక్కనుండగా, ఈసారి బీసీ మహిళకు రిజర్వు చేశారు. రిజర్వేషన్ ఖరారు కావడంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకు పార్టీ కోసం చేసిన సేవలు, నిర్వహించిన కార్యక్రమాల వివరాలను ఎమ్మెల్యేలు, మంత్రులు, కూటమి ముఖ్య నేతలకు అందజేస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం నగర మేయర్ పదవి కూడా మహిళకు కేటాయించిన నేపథ్యంలో స్థానిక సంస్థల్లో కీలక పదవుల కోసం నేతల మధ్య పోటీ మరింత పెరిగింది.