Share News

శ్రీకాకుళం మేయర్‌.. జనసేనకు..

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:41 AM

Three municipalities for the TDP స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం.. అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. శ్రీకాకుళం నగర పాలక సంస్థను పొత్తుల్లో భాగంగా ‘జనసేన’కు కేటాయించింది. ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలు తెలుగుదేశంపార్టీ అభ్యర్థులకు కేటాయించారు.

శ్రీకాకుళం మేయర్‌.. జనసేనకు..

మిగిలిన మూడు మునిసిపాలిటీలు టీడీపీకి

ఖరారు చేసిన కూటమి...

పేర్లు లేకుండా జాబితా విడుదల

టీడీపీలో ఆశావహులకు నిరాశే

శ్రీకాకుళం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం.. అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. శ్రీకాకుళం నగర పాలక సంస్థను పొత్తుల్లో భాగంగా ‘జనసేన’కు కేటాయించింది. ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలు తెలుగుదేశంపార్టీ అభ్యర్థులకు కేటాయించారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌కు మేయర్‌ ప్రకటన.. జిల్లా జనసేనలో ఆనందం నింపింది. కానీ తెలుగుదేశం పార్టీలో ఆశావహులకు మాత్రం ఊహించని విధంగా నిరాశ ఎదురైంది.

మేయర్‌ పదవి కోసం జనసేన నుంచి దానేటి...

జనసేన నుంచి ఆఖరినిముషంలో శ్రీకాకుళం మేయర్‌ పదవిని ఆశిస్తూ రెండు రోజుల క్రితం జనసేన నాయకులు డా.దానేటి శ్రీధర్‌ దరఖాస్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధిష్ఠానం శ్రీకాకుళం మేయర్‌ తాము కోరుతున్నామని... మిగిలిన మునిసిపాలిటీలు టీడీపీ తీసుకోవాలని ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వద్దకు వెళ్లింది. జనసేన ప్రతిపాదనను ఆమోదించారు. ఈ విషయం గురువారం రాత్రి ఖరారైంది. అయితే కూటమి నుంచి .. జనసేన తరపున శ్రీకాకుళం మేయర్‌గా పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా.. దానేటి శ్రీధర్‌ గతంలో వైసీపీలో ఉండగా.. ఆర్థికంగా ఆ పార్టీ ఉపయోగించుకున్నా.. సముచిత స్థానం కల్పించలేదు. తర్వాత కొన్నాళ్లు వేచి ఉండి జనసేనలో చేరారు. ఇప్పుడు కూటమి పొత్తుల్లో భాగంగా తన సతీమణి రాధారాణి పేరుతో మేయర్‌ సీటు ఆశించారు. ఈ ఒక్క ప్రతిపాదనే అధిష్టానానికి వెళ్లడంతో దాదాపుగా రాధారాణి.. అన్నీ కలసివస్తే.. శ్రీకాకుళం మేయర్‌గా కొలువుతీరే అవకాశం ఉంది.

జడ్పీ పీఠానికి.. టీడీపీ నుంచి పెరిగిన పోటీ!

శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠం కోసం పోటీ పెరుగుతోంది. ఈ పదవికి టీడీపీ నుంచి ముగ్గురు పేర్లు తెరపైకి వచ్చాయి. జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ స్థానం బీసీ మహిళ(జనరల్‌)కు రిజర్వ్‌ అయింది. దీంతో ఈ పదవిని దక్కించుకునేందుకు టీడీపీలో ముగ్గురు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తన సతీమణి కలమట ఇందిరకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుడు మహమ్మద్‌ నజీర్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌కు దరఖాస్తు అందజేశారు. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మికి మరోసారి అవకాశం ఇవ్వాలని ఆమె కుమారుడు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌ ప్రయత్నిస్తున్నారు. వీరు కళింగ సామాజికవర్గానికి చెందినవారు. ఆమదాలవలస మండలంలో కాపు సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ పీరికట్ల విశ్వప్రసాద్‌ కుటుంబం నుంచి మహిళను జడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా నిలపాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇలా ముగ్గురూ టీడీపీకి చెందినవారే కావడంతో అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. జడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎంపికలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ నిర్ణయం కీలకం కానుంది. వీరి సిఫారసుల ఆధారంగా టీడీపీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు, జడ్పీ పీఠం కోసం వైసీపీ నుంచి ఇప్పటివరకు బలమైన అభ్యర్థుల పేర్లు తెరపైకి రాలేదు.

Updated Date - Oct 16 , 2026 | 12:41 AM