శ్రీకాకుళం కమిషనర్ సస్పెన్షన్
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:13 AM
Commissioner suspended నగరపాలక సంస్థ పరిధిలో డయేరియా (గ్యాస్ట్రో ఎంటరైటిస్) కేసులు ప్రబలడం, ఒకరు ప్రాణాలు కోల్పోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించిన శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ హెచ్.కూర్మారావుపై సస్పెన్షన్ వేటు వేసింది.
డయేరియా వ్యాప్తి నేపథ్యంలో వేటు
ఇన్‌చార్జి కమిషనర్‌గా ఆర్డీఎంఏ రవీంద్ర
శ్రీకాకుళం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలో డయేరియా (గ్యాస్ట్రో ఎంటరైటిస్) కేసులు ప్రబలడం, ఒకరు ప్రాణాలు కోల్పోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించిన శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ హెచ్.కూర్మారావుపై సస్పెన్షన్ వేటు వేసింది. కూర్మారావు స్థానంలో శ్రీకాకుళం కార్పొరేషన్ ఇన్‌చార్జి (పూర్తి అదనపు బాధ్యతలు-ఎఫ్‌ఏసీ) కమిషనర్‌గా విశాఖపట్నం ఆర్డీఎంఏ వి.రవీంద్రను నియమించింది. ఈ మేరకు పురపాలిక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
కమిషనర్ నిర్లక్ష్యం వల్లే...
కార్పొరేషన్, మునిసిపాలిటీల్లో తాగునీటి సరఫరాలో లీకేజీలు లేకుండా చూడాలని, హ్యాండ్ పంపులకు వెంటనే మరమ్మతులు చేయాలని మునిసిపల్‌శాఖ పలు దఫాలుగా టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా అధికారులకు ఆదేశాలు జారీచేసింది. క్లోరినేషన్ తప్పనిసరిగా చేస్తూ నీటి నాణ్యతను ప్రతిరోజూ పరీక్షించాలని స్పష్టం చేసింది. వీటిని అమలు చేయడంలో శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ కూర్మారావు విఫలమయ్యారని ప్రభుత్వం గుర్తించింది. ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించడం, విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించడం వల్లే నగరంలో డయేరియా వ్యాప్తి చోటుచేసుకుందని స్పష్టం చేస్తూ.. 1991 ఏపీ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) నిబంధనల్లోని రూల్ 8(1) ప్రకారం ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సస్పెన్సన్ కాలంలో ఆయన ముందస్తు అనుమతి లేకుండా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. కాగా కూర్మారావు బాధ్యతలు చేపట్టిన రెండు వారాలకే సస్పెన్సన్‌కు గురి కావడం గమనార్హం.