విద్యార్థికి రూ.5 చొప్పున ఇవ్వాల్సిందే!
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:51 AM
శ్రీకాకుళం జిల్లా సహాయ బీసీ బాలుర సంక్షేమ వసతి గృహ అధికారి (ఏబీసీడబ్ల్యూవో) జి.బాలముకుందరావు వార్డెన్ల నుంచి లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కారు.
వార్డెన్లకు శ్రీకాకుళం జిల్లా ఏబీసీడబ్ల్యూవో హుకుం
రూ.1.84 లక్షలు తీసుకుంటుండగా అదుపులోకి
కంచిలి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా సహాయ బీసీ బాలుర సంక్షేమ వసతి గృహ అధికారి (ఏబీసీడబ్ల్యూవో) జి.బాలముకుందరావు వార్డెన్ల నుంచి లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ ఇన్‌చార్జి డీఎస్పీ బీవీఎ్‌సఎస్ రమణమూర్తి, సీఐ కె.భాస్కర్ వెల్లడించిన వివరాల మేరకు.. నరసన్నపేటలో ఏబీసీడబ్ల్యూవోగా పనిచేస్తున్న బాలముకుందరావు కంచిలి, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లోని వసతి గృహాలకు ఎఫ్‌ఏసీగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి విద్యార్థికీ ఐదు రూపాయల చొప్పున తనకు లంచం ఇవ్వాలని, లేని పక్షంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్డెన్లను హెచ్చరించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వార్లు ఆ నగదు ఆయనకు ఇచ్చేందుకు బుధవారం కంచిలి బీసీ వసతి గృహం వద్ద సమావేశం అయ్యారు. ఈ సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి, వార్డెన్లు సిద్ధం చేసిన రూ.1,84,070 స్వాధీనం చేసుకున్నారు. ఏబీసీడబ్ల్యూవోపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ ఇన్‌చార్జి డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.