Share News

శ్రావ్యకు 2వ ర్యాంకు

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:31 AM

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. బుధవారం విడుదలైన ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో పొందూరు పట్టణానికి చెందిన విద్యార్థిని కోరుకొండ శ్రావ్య రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించింది.

 శ్రావ్యకు 2వ ర్యాంకు
స్టేట్‌ సెకండ్‌ ర్యాంకర్‌ శ్రావ్యకు మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు

- ఏపీ ఈఏపీసెట్‌లో పొందూరు విద్యార్థిని సత్తా

- జిల్లా వాసులకు ఉత్తమ ర్యాంకులు

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. బుధవారం విడుదలైన ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో పొందూరు పట్టణానికి చెందిన విద్యార్థిని కోరుకొండ శ్రావ్య రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. మరికొందరు జిల్లా విద్యార్థులు కూడా ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మా స్ట్రీమ్‌లో ఉత్తమ ర్యాంకులు పొందారు.

జాబ్‌ చేస్తా.. తరువాత సివిల్స్‌ రాస్తా

పొందూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): పొందూరు పట్టణం మూగోడు వీధికి చెందిన కోరుకొండ శ్రావ్య ఏపీ ఈఏపీసెట్‌లో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఇటీవల విడుదలలైన జేఈఈ మెయిన్స్‌లో జాతీయస్థాయిలో 108, ఏబీసీ కేటగిరీలో 17వ ర్యాంకు సాధించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో 111, ఏబీసీ కేటగిరీలో 17వ ర్యాంకు పొందింది. జాతీయస్థాయి ఉమెన్‌ కేటగిరీలో సౌత్‌ఇండియా స్థాయిలో ఒకటో ర్యాంకు జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. కొద్ది రోజుల కిందట ప్రకటించిన తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో 17వ ర్యాంకు సాధించింది. శ్రావ్య ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు పొందూరులోని మానసవేణి కాన్వెంట్‌లో, ఆరు నుంచి ఎనిమిది వరకు రాజాంలోని శ్రీచైతన్య స్కూల్‌లో, తొమ్మిది నుంచి ఇంటర్‌ వరకు విజయవాడలోని శ్రీచైతన్య వేదవ్యాస్‌ భవన్‌లో చదివింది. తాను ఈస్థాయిలో రాణించడానికి తండ్రి కృష్ణారావు, తల్లి లక్ష్మీరాజ్యం, సైన్స్‌ టీచర్‌ బస్వా సురేష్‌ కారణమని తెలిపింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 111 ర్యాంకు సాధించడంతో మద్రాస్‌ ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో సీటు వచ్చినట్లు చెప్పింది. కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసి కొంతకాలం పేరొందిన ఐటీ పరిశ్రమలో ఉద్యోగం చేస్తానని, అనంతరం సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ కావాలనేది తన లక్ష్యమని శ్రావ్య తెలిపింది. ఏపీ క్యాడర్‌లో ఐఏఎస్‌ అధికారిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించడమే తన లక్ష్యమని చెప్పింది. కుమార్తెకు రెండో ర్యాంకు రావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. శ్రావ్యకు పలువురు ఉపాధ్యాయులతో పాటు పొందూరు పట్టణవాసులు అభినందనలు తెలిపారు.

మరికొందరు విద్యార్థులకు..

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌/ఎచ్చెర్ల/నరసన్నపేట/కంచిలి,జలుమూరు,మెళియాపుట్టి, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఏపీ ఈఏపీసెట్‌లో జిల్లాకు చెందిన మరికొందరు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. గతనెల 12 నుంచి 18వరకు ఈ పరీక్షలు జరిగాయి.

ఇంజనీరింగ్‌ విభాగంలో..

ఇంజనీరింగ్‌ విభాగంలో గణాంకాలను పరిశీలిస్తే జిల్లా నుంచి మొత్తం 6,802 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,802 మంది బాలురు, 3,000 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 6,557 మంది పరీక్షలకు హాజరుకాగా అందులో 4,722 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్‌ పరీక్ష రాసినవారిలో 3,670 మంది బాలురు, 2,887 మంది బాలికలు ఉండగా అర్హత సాధించిన 4,722 మందిలో 2,635 మంది బాలురు, 2,087 మంది బాలికలు ఉన్నారు.

- ఇంజనీరింగ్‌ విభాగంలో పొందూరు గ్రామానికి చెందిన కొరుకుండ శ్రావ్య రాష్ట్రస్థాయిలో 95.56 శాతం స్కోర్‌ చేసి రెండో ర్యాంకు సాధించారు. మెళియపుట్టి మండలం మాకన్నపల్లికు చెందిన తాడేల మురళీ 71, పోలాకి మండలం చెల్లాయివలసకు చెందిన పాలకొండ వెంకట కారుణ్య రామ్‌ 78, నరసన్నపేట ఇందిరానగర్‌కు చెందిన తండ్యాల పవన్‌సాయి 106, నరసన్నపేట శ్రీరామనగర్‌లో ఉంటున్న అల్లు రోహిత్‌కు 110, ఎచ్చెర్ల కుశాలపురానికి చెందిన వాసిరెడ్డి సందీప్‌ 124, రణస్థలం మండలం సంచాం గ్రామానికి చెందిన రెడ్డి మోహన్‌మనోజ్‌ 133, జలుమూరు మండలం తిమడాంకు చెందిన వెలమల సూర్యసిద్ధార్ధ 139, పొనుగుటివలసకు చెందిన సతివాడ కౌశిక్‌ 140, కంచిలి మండలం మతంసారిపల్లి గ్రామానికి చెందిన బత్తుల వంశీ కృష్ణ 160, కంచిలి బీపీ కాలనీకి చెందిన త్రిషా ప్రధాన్‌ 1,029 ర్యాంకు సాధించారు.

అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగంలో..

అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగంలో జిల్లాలో బాలికలదే పైచేయి. మొత్తం 2,721 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో ఏకంగా 2,262 మంది బాలికలే కావడం గమన్హారం. బాలురు కేవలం 459 మంది మాత్రమే ఉన్నారు. పరీక్షకు 2,446 మంది హాజరుకాగా వారిలో 2,198 మంది అర్హత సాధించారు. 1844 మంది బాలికలు ఉండగా, బాలురు కేవలం 354 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

- అగ్రికల్చర్‌ విభాగంలో కోటబొమ్మాళి మండలం కన్నెవలసకు చెందిన రావాడ దర్శణ్‌ రాష్ట్రస్థాయిలో 55వ ర్యాంకు, శ్రీకాకుళం నగరం తుమ్మవీధికి చెందిన సురవరం రాజనైషిత నిధి 65, పాతపట్నంకు చెందిన దూసి వైష్టవి 115, జలుమూరు మండలం దరివాడకు చెందిన కొర్ను కిరణ్మయికు 137, వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామానికి చెందిన ఆర్‌ఎం సాయిప్రసాద్‌కు 139, శ్రీకాకుళం మండల వీధికి చెందిన దొండపర్తి కృష్ణపూజిత 141, పాతపట్నం మండలం బూరగాంకు చెందిన ఎస్‌. సౌమ్యకు 240 ర్యాంకు సాధించారు.

Updated Date - Jul 02 , 2026 | 12:31 AM