Share News

ఆధ్యాత్మిక శోభ

ABN , Publish Date - Mar 29 , 2026 | 11:48 PM

జిల్లాలో పలుచోట్ల ఆదివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

ఆధ్యాత్మిక శోభ
జమ్ములో సీతారామచంద్రుల కల్యాణం నిర్వహిస్తున్న దృశ్యం

జిల్లాలో పలుచోట్ల ఆదివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా నరసన్నపేట, పోలాకిలో సీతారాముల కల్యాణంతో పాటు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పాతపట్నంలో శ్రీనివాసుని కల్యాణం, శ్రీముఖలింగంలో ముఖలింగేశ్వరస్వామి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సీతారాముల కల్యాణం

నరసన్నపేట, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమి వసంత వేడుకల సందర్భంగా ఆదివారం జమ్ము రామాలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, పరిషత్‌ రక్షాధారణ, అంకురారోపణ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరిపించారు. అనంతరం రుత్వీకులు మావుడూరి జగదీష్‌ సోదరుల ఆధ్వర్యంలో స్వామివారి నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వాన గోవిందరాజులు, డాక్టర్‌ రెడ్డి సంధ్య, రెడ్డి శ్రీనివాసరావు, బుచ్చిబాబు, గోపాలకృష్ణ, పాపారావు, గొండు రాంబాబు, శ్రీనివాస భజనబృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కనుల పండువగా సీతారాముల పట్టాభిషేకం

పోలాకి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): దీర్గాశి రామమందిర ప్రాంగణంలో గణేష్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సీతారాముల పట్టాభిషేకం కనుల పండువగా జరిగింది. ఆరవల్లి కృష్ణశర్మ, ఆలయ పూజారి తులసిపాటి రమణయ్య సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. నిర్వాహకుడు గేదెల శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీనివాసుని కల్యాణం

పాతపట్నం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): స్థానిక కల్యాణ వేంకటే శ్వరుని ఆలయంలో ఆదివారం శ్రీనివాస, అలివేలు మంగమ్మ, గోదాదే వీల కల్యాణం వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాథచార్యులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవం

జలుమూరు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) శ్రీముఖలింగేశ్వరస్వామి గ్రామోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను అర్చకులు బయటకు తెచ్చి నూతన వస్త్రాలను ధరించి పూలమాలలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పల్లకిలో ఆసీనులను చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు, మహిళలు మంగళ హారతులు అందించి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఏడుకొండలు, పాలకమండలి చైర్మన్‌ శివ ప్రసాద్‌ పాడి, అర్చకులు నారాయణమూర్తి, ఎస్‌.వి.చలం, శ్రీకృష్ణ, శివ, అచ్యుత, అప్పారావు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 11:48 PM