ప్రాణం తీసిన అతివేగం
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:53 PM
Road accident near Nandigam అతివేగం.. నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ముందు వెళ్తున్న వాహనాలను అధిగమించే(ఓవర్ టేకింగ్) క్రమంలో.. రోడ్డుపక్కన ఆగి ఉన్న వ్యాన్‌ను ఓ స్కార్పియో వాహనం ఢీకొంది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు ఒడిశా వాసులు మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
నందిగాం సమీపంలో రోడ్డు ప్రమాదం
ముందు వెళ్తున్న వాహనాలను అధిగమించబోయి..
ఆగిఉన్న వ్యాన్‌ను ఢీకొన్న స్కార్పియో
ఇద్దరు ఒడిశా వాసులు మృతి.. మరో ఐదుగురికి గాయాలు
టెక్కలి/నందిగాం, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): అతివేగం.. నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ముందు వెళ్తున్న వాహనాలను అధిగమించే(ఓవర్ టేకింగ్) క్రమంలో.. రోడ్డుపక్కన ఆగి ఉన్న వ్యాన్‌ను ఓ స్కార్పియో వాహనం ఢీకొంది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు ఒడిశా వాసులు మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఒడిశా నుంచి వైద్యసేవల నిమిత్తం శ్రీకాకుళంలో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తుండగా.. నందిగాం జాతీయ రహదారి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నందిగాం సమీపాన జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా చీకటి బ్లాక్‌కు చెందిన సున్నాపల్లి గ్రామానికి చెందిన వాసుపిల్లె దాలయ్య(46), వాసుపిల్లె మోహినమ్మ(50) అక్కడికక్కడే మృతిచెందారు. అదే గ్రామానికి చెందిన బైపల్లి చంద్రమణి, వాసుపిల్లె ముత్యాలమ్మ, వాసుపిల్లె నీలాద్రి, డొంకా రామారావు, డ్రైవర్ పులకల వెంకటేష్ గాయపడ్డారు. మరో 19 ఏళ్ల యువతి బుడ్డ భారతమ్మ మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సున్నాపురానికి చెందిన ఓ వ్యక్తి బ్రెయిన్‌స్ర్టోక్‌కు గురికాగా.. మెరుగైన వైద్యసేవల నిమిత్తం శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి స్కార్పియో వాహనంలో తీసుకెళ్తుండగా.. వీరంతా ప్రమాదానికి గురయ్యారు. పలాస నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఓ లారీని ఓ బస్సు ఓవర్‌టేక్ చేస్తోంది. ఆ రెండు వాహనాలను అధిగమించే క్రమంలో నందిగాంలో రోడ్డు పక్కన ఆగిఉన్న వ్యాన్‌ను వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం ఢీ కొంది. దీంతో ప్రమాదం జరగ్గా.. సురక్షితంగా బయటపడిన భారతి రోదిస్తూ పోలీసులకు, 108 వాహన సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వెంటనే నందిగాం పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్కార్పియోలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను టెక్కలిలోని జిల్లా కేందాసుపత్రికి తరలించారు. డొంకా రామారావుకు మెరుగైన వైద్యసేవల నిమిత్తం శ్రీకాకుళంలో రిమ్స్‌కు తీసుకెళ్లారు. మృతులు, క్షతగాత్రుల బంధువులు ఆదివారం ఉదయం ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. భారతి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నందిగాం ఎస్‌ఐ షేక్ మహ్మద్ ఆలీ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.