Share News

ఇన్‌ సర్వీసు టీచర్లకు ప్రత్యేక టెట్‌

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:26 AM

ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించేందుక విద్యాశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బుధవారం మెమో జారీ చేశారు.

 ఇన్‌ సర్వీసు టీచర్లకు ప్రత్యేక టెట్‌

- మెమో జారీ చేసిన విద్యాశాఖ

- ఆనందం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించేందుక విద్యాశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బుధవారం మెమో జారీ చేశారు. 2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్‌ను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్‌సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31నాటికి టెట్‌ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వారిలో కలవరం నెలకొంది. దీనిపై సుప్రీంలో రిట్‌ ఫిటిషన్‌ వేశారు. అక్కడ వాదోపవాదాలు ముగిసిన తర్వాత ఈ ఏడాది మే 29న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 1 నుంచి 8వ తరగతి వరకు బోధించే ప్రతీ టీచర్‌ టెట్‌ పాస్‌ కావాల్సిందేనని స్పష్టం చేసింది. టెట్‌పై దాఖలైన పిటీషన్లను కొట్టివేసింది. టెట్‌ పాస్‌ కావడానికి గతంలో రెండేళ్ల సమయం ఇవ్వగా, తాజాగా మరో ఏడాది 2028 ఆగస్టు 31 వరకు పొడిగించింది. 2010 ఆగస్టు 23కు ముందు నియమితులై, పదవీ విరమణకు ఐదేళ్లకంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులందరికీ టెట్‌ తప్పనిసరి చేసింది. జిల్లాలో 11,437 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో 2010 డీఎస్సీ నుంచి ఎంపికైన ఉపాధ్యాయులకు టెట్‌ అవసరం లేదు. అంతకు మునుపు నుంచి నియమించిన వారికి మాత్రం టెట్‌ అవసరం. జిల్లాలో 1998 నుంచి 2003 వరకు నిర్వహించిన డీఎస్సీలో ఎక్కవ ఉపాధ్యాయ పోస్టులను నియమించారు. జిల్లాలో టెట్‌ అర్హత లేని ఉపాధ్యాయులు సుమారు 5,639 మంది వరకు ఉన్నారు. గతేడాది నిర్వహించిన టెట్‌ పకు ఇన్‌సర్వీసులో ఉన్న వారు 30శాతం మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో వందల సంఖ్యలో మాత్రమే అర్హత సాధించారు. ఇంకా ఇప్పటికీ 5 వేల మందిపైగా టెట్‌ ఉత్తీర్ణత కావాల్సి ఉంది. ఇటీవల టెట్‌కు జిల్లా నుంచి 40శాతం మేరకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆదేశాలతో ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహణకు పచ్చజెండా ఊపింది.

Updated Date - Jul 09 , 2026 | 12:26 AM