మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా
ABN , Publish Date - Nov 14 , 2026 | 12:31 AM
No disruption to liquor supply స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం విక్రయాలు, సారా తయారీ, బెల్ట్‌షాప్‌లను పూర్తిస్థాయిలో అరికట్టాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ కమిషనర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు.
ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్
శ్రీకాకుళం క్రైం/ ఎచ్చెర్ల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం విక్రయాలు, సారా తయారీ, బెల్ట్‌షాప్‌లను పూర్తిస్థాయిలో అరికట్టాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ కమిషనర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ఎక్సైజ్ అధికారులతో డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రాహుల్‌దేవ్‌శర్మతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుడా నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని, ఆకస్మిక తనిఖీలు, దాడులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోవడంతోపాటు లైసెన్స్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు.
మద్యం సరఫరాకు ఆటంకం వద్దు
జిల్లాలోని మద్యం దుకాణాలకు నిబంధనల ప్రకారం సకాలంలో మద్యం సరఫరా చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ చమకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎచ్చెర్లలోని బాట్లింగ్ యూనిట్ (ఐఎంఎల్ డిపో)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిపోలోని మద్యం నిల్వలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. దుకాణాల డిమాండ్‌కు అనుగుణంగా మద్యం సరఫరాలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి స్పష్టం చేశారు. సమావేశంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు సుర్జీత్‌సింగ్, శ్రీనివాసచౌదరి, అసిస్టెంటు కమిషనర్లు మనోహర్, రామచంద్రరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు తిరుపతినాయుడు, శ్రీనాధుడు, సహదేవుడు, ఐఎంఎల్ డిపోమేనేజర్ జయసింహ చౌదరి, అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసరావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, స్టేషన్‌హౌస్ ఆఫీసర్లు పాల్గొన్నారు.